వనపర్తి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): చేపల పెంపకంపై పరిశోధనలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో తొలిసారి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో మత్య్సకళాశాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో డిగ్రీ చదివి పీజీ, పీహెచ్డీ చేసే అవకాశం ఉన్నది.
27.5 ఎకరాల్లో కళాశాల
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్యశాలకు అనుబంధంగా పెబ్బేరులో 2017లో కళాశాల ఏర్పాటుచేశారు. 27.5 ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, విద్యార్థులకు హాస్టల్ వసతి, క్యాంటీన్ ఏర్పాటుచేస్తున్నారు. ఇటీవల కొత్త కళాశాల భవనాన్ని మంత్రులు నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఈ కళాశాలలో విద్యార్థులకు మత్స్యశాస్త్ర బోధన, మత్స్యశాస్త్ర పరిశోధన, మత్స్య కార్య కలాపాలపై పరిశోధనలు, మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ, పురోగతిపై విస్తరణ వంటివి తెలియజేస్తున్నారు.
ఎంసెట్ ద్వారా విద్యార్థుల ఎంపిక
ఎంసెట్‌లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఇక్కడి కోర్సులకు ఎంపిక చేస్తున్నారు. నాలుగేండ్ల ఈ కోర్సు కోసం ఏటా 25 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. మొదటి మూడేండ్లు మత్స్యరంగ కోర్సులపై బోధిస్తారు. నాలుగో ఏడాది పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రానికి పంపించి శిక్షణ ఇస్తారు. అనంతరం డూయింగ్ అండ్ ఎర్నిం గ్ విధానంలో పనిచేస్తూ పారిశ్రామిక అభివృద్ధిలో విద్యార్థులు పాలుపంచుకుంటారు.
వివిధ అంశాలపై బోధన
ఆక్వా కల్చర్, ఆక్వెటిక్ యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఫిషరీస్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫిషరీస్ ఇంజినీరింగ్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వంటి అంశాలపై బోధిస్తున్నారు.
భారీగా ఉపాధి అవకాశాలు
మత్స్యశాఖ అభివృద్ధి అధికారులుగా, ఫిషరీస్ ఇన్స్పెక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు. బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. స్వయం ఉపాధితోపాటు ప్రైవేట్‌రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి.
మంచి భవిష్యత్
మత్స్యరంగం దినదినాభివృద్ధి చెందుతున్నది. జనాభా పెరుగుతున్న కొద్దీ చేప మాంసం వినియోగం పెరుగుతున్నది. దీంతో మత్స్య సంపద క్రమేపీ పెంచుకోవాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విజన్‌తో ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో ఏకైక కళాశాల కావడంతో డిమాండ్‌కు సరిపడా సీట్లు లేవు. సీట్లు పెంచే ఆలోచన ఉన్నది. విద్యార్థులకు హాస్టల్ వసతితోపాటు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ కోర్సులు చదివినవారికి మంచి భవిష్యత్ ఉంటుంది.