e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టేందుకే దళితబంధు : సీఎం కేసీఆర్‌

ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టేందుకే దళితబంధు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరిచి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి, తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలనే అత్యున్నత ఆశయం, సామాజిక బాధ్యతతో దళితబంధు అమలులోకి తీసుకువచ్చినట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన రాష్ట్రంలో నలుమూల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పున ఉన్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చేస్తున్నామని, వాసాలమర్రి, హుజూరాబాద్‌లో ప్రకటించిన మాదిరిగా నిధులు విడుదల చేస్తామన్నారు.

నాలుగు జిల్లాలకు రెండు మూడు వారాల్లో నిధులు

- Advertisement -

నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని ఆదేశించారు. దళితబంధు పథకం దేశంలో మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్న ఆలోచన, ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమేనన్నారు. పథకాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ దళితజాతి అభ్యున్నతికి బాటలు వేసినవారమవుతామని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళితబంధును ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ఇమిడి ఉందన్నారు.

దళితబంధుకు అసెంబ్లీ సాక్షిగా రూపకల్పన

దళితబంధుకు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని సీఎం తెలిపారు. ‘దళిత ఎంపవర్ మెంట్ కింద రూ.1000 కోట్ల కూడా నేనే స్వయంగా అసెంబ్లిలో ప్రకటించిన. వివిధ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన దళిత పెద్దలు, మేధావులతో దఫాధఫాలుగా చర్చించిన తర్వాత దళితబంధు కార్యక్రమానికి అమలు రూపకల్పన జరిగింది. ఏదైనా మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని సంపూర్ణంగా తీసుకుంటే బాగుంటుందని సలహాలు, సూచనలు వచ్చాయి. అందులో భాగంగానే హుజూరాబాద్ లో దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. ఇదేదో రోటిన్ వ్యవహారం కాదు.. గతంలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని కార్యక్రమం ఇది’ అని సీఎం అన్నారు. ‘కశ్మీర్ నుంచి కన్యాకూమారి దాకా వివక్ష, ఆర్తి, బాధతో వున్న వర్గం ఏదైనా ఉన్నదంటే అది దళిత జాతేననే విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ కంపేరిటివ్ స్టడీలు నివేదికలు అందించాయని’ సీఎం గుర్తు చేశారు.

యావత్‌ సమాజం బాగు చేసుకోవాలి

స్వాతంత్ర్యానంతరం అరకొర అభివృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు ఇంకా రాలేదన్నారు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఆపదవస్తే ఎట్లైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను యావత్ సమాజం బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకొని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని స్పష్టం చేశారు. ఎక్కడైతే వివక్ష విపరీతంగా ఉంటుందో అక్కడ మేలుకొలుపు ఉంటుందని, అట్లా చైతన్యం పొందిన వారే పోరాటం చేసి 100 శాతం విజయాన్ని సాధిస్తారన్నారు. తాను మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం కన్నాముందే ఇదే విషయాన్ని 1996లో ఎస్ఆర్ఎస్పీ కాలువమీద ప్రజలతో స్పష్టం చేశానన్నారు. అనుకున్నట్లే వివక్షకు గురైన నాటి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి విజయాన్ని సాధించామని చెప్పారు. స్వరాష్ట్రంలో అనేక రంగాల్లో దేశం గర్వించదగ్గ అభివృద్ధి సంక్షేమం సాధించామని కేసీఆర్‌ తెలిపారు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఏదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదని దశలవారీగా విజయాన్ని చేరుకుంటామన్నారు. దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్లో నిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తామన్నారు.

పేరంటల్ అప్రోచ్ ఉండాలే..

దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్ అప్రోచ్‌తో పని చేయాలని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులను దళితబంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లాగా ఆదుకోవాలన్నారు. వారితో అధికార దర్పంతో కాకుండా కన్నబిడ్డను ఎట్లైతే తల్లిదండ్రలు ఆలనా పాలనా చూస్తారో ఆ పద్ధతిలో వ్యవహరించాలన్నారు. సమన్వయకర్తల్లాగా కలిసి పనిచేయాలన్నారు. దళితుల్లో ఈ సందర్భంగా ఒక విశ్వాసాన్ని పాదుకొల్పాన్నారు. దళితుబంధు పథకాన్ని తన భూజాలమీద మోయాల్సిన సమయం విద్యావంతులైన దళిత యువతకు ఆసన్నమయిందన్నారు. దళిత యువతను ఈ పథకంలో భాగాస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ పథకంలో సపొర్టు స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. ఇందుకోసం రక్షణ నిధిని ఏర్పాటు చేసిన విషయం సీఎం వివరించారు.

సమావేశానికి నాలుగు మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కులాల సంక్షేమం అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నల్లగొండ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎంపీ, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీనియర్ దళిత రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు లింగాల కమల్ రాజ్, డీ శోభ, పీ పద్మావతి బంగారయ్య, జి.దీపిక హాజరయ్యారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి, సీఎం సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పోరేషన్ ఎండీ కరుణాకర్, టీఎస్ఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్ రావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సూర్యాపేట్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జితేష్ వి.పాటిల్, పి. ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana