వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలె
వ్యవసాయమంత్రికి సీఎం ప్రశంసలు
హైదరాబాద్, మార్చి 8 : వనపర్తి జిల్లాలో మంగళవారం తన పర్యటనలో మంత్రి నిరంజన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. చక్కని అభివృద్ధితో వనపర్తి ప్రజలను నిరంజన్‌రెడ్డి గెలిపించారని చెప్పారు. ‘నిరంజన్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పనిలేదు. నిరంజన్‌రెడ్డి తపన ఏంటో మీకు తెలుసు. ఘనపురం మండలంలో కర్నెతండా అని ఉంటది. ఆ కర్నెతండాకు లిఫ్ట్ కావాలని నా వెంటపడి మరీ దాన్ని నాతో మంజూరు చేయించాడు. మీరు ఆయనకు నీళ్ల నిరంజన్‌రెడ్డి అని పేరు పెట్టుకున్నరు. నేను ఒక్కటే కోరుతున్నాను. ఆనాడు రాజాగారి బంగాళాలో ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్నికల సభ జరిగినప్పుడు మీకు ఒక్కటే హామీ ఇచ్చిన. నిరంజన్‌రెడ్డిని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన వట్టి ఎమ్మెల్యేగా ఉండడు.. మీ ప్రాంతం పచ్చబడుతది.. లాభమైతది అని చెప్పిన. మీరు నా మాటమీద గౌరవంతో నిరంజన్‌రెడ్డిని గెలిపించిండ్రు..అట్లనే వనపర్తి ప్రజలను నిరంజన్‌రెడ్డి గెలిపించిండు. ఈసారి నిరంజన్‌రెడ్డి నామినేషన్ వేస్తే లక్ష మెజార్టీతో గెలిపించాలని నేను మీ అందరినీ కోరుతున్న ’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
నిరంజన్‌రెడ్డి నా ఫ్రెండ్.. గర్వంగా చెప్తున్న
‘నిరంజన్‌రెడ్డి నా ఫ్రెండ్. నాకు వ్యక్తిగతమైన మిత్రుడు. ఒక రకంగా ఇట్లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను గర్వపడుతున్న. వనపర్తి జిల్లాలోని ఈ వికాసానికి ఆయనే కారణం. ఈ డెవలప్మెంట్ వనపర్తిలో వస్తదని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. ఇదో అద్భుతం. ఏ రంగంలో చూసినా కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. నిరంజన్‌రెడ్డి నాయకత్వానికి వనపర్తే ఉదాహరణ. పనిచేసి సాధించాలి, నా ప్రజలకు మేలు చేయాలి, అని అనునిత్యం తండ్లాడే వ్యక్తి నిరంజన్‌రెడ్డి. ఈ తపన అందరిలో ఉంటే వనపర్తిలాగనే అన్ని జిల్లాలు తప్పకుండా అభివృద్ధి అయితయి. నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో ఇంకా మంచిగ పనిచేయండి. ఆదర్శంగా ముందుకు పోండి. మీరు నమ్మరు నేను చెప్తే.. నిన్న అసెంబ్లీ ఉంటే నిరంజన్‌రెడ్డి హైదరాబాద్ వచ్చిండు. నిన్న కూడా వదిలిపెట్టలేదు నన్ను. సార్ మా లంబాడితండాలో రోడ్లు ఉన్నయ్. రూ.18 కోట్లు కావాలే.. సంతకం పెట్టు అని నా మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించిండు. ఫలానా గూడెం, ఫలానా తండా, ఫలానా ఊరు ఏది వదిలిపెట్టలె’ అని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.