e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్‌

వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి, అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌ షిప్‌లు, ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్‌, వైన్‌షాప్‌లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ‘అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం స్పష్టం చేశారు. దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృధ్ది చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేననని పేర్కొన్నారు.

గుణాత్మక మార్పు జరుగలే..

- Advertisement -

స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి మహాశయుడు అంబేద్కర్‌ తీసుకువచ్చి అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పేమి జరుగలేదన్నారు. దళితబంధు పథకం అమలు తీరు అందుకు అనుసరించాల్సిన పద్ధతులు, విధి విధానాలుపై అధికారులు వివరించారు. మొదటిదశలో పథకం అమలు పటిష్టంగా జరగాలన్నారు. రెండో దశలో పథకం పర్యవేక్షణ కీలకమన్నారు. దీనికి జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబందు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు దళితబంధు కమిటీలు

గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు కమిటీలు ఉంటాయని సీఎం చెప్పారు. కమిటీల ద్వారా లక్షకుపైగా దళిత బిడ్డలు ఆ జాతి సంరక్షణను తమ భుజాలమీద వేసుకొని నిర్వహించనున్నారని తెలిపారు. తమ జాతి అభివృద్ధికి తామే స్వయంగా భాగాస్వాములను చేయడం ఈ పథకం గొప్పతనమన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నిక కాబడిన వారే రీసోర్స్‌పర్సన్లుగా పని చేస్తారన్నారు. పథకాలను ఎంచుకునే క్రమంలో పునరావృతం కాకుండా, లాభసాటిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే చక్కటి తెలంగాణ అభివృద్ధికి బాటలు పడతాయని సీఎం అన్నారు.

ప్రభుత్వం ఏ వర్గాన్ని విస్మరించలే..

తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరుస్తున్నామన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా రైతుబంధు పథకాన్ని అన్ని వర్గాలకు అమలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నరాష్ట్ర ప్రభుత్వం, నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.

‘దళిత జాతి అభివృద్ధిలో మీరు చాలా గొప్ప పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నా’నని, సమావేశంలో పాల్గొన్న నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. అధికార దర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ‘అభివృద్ధిని సాధించి తీరుతామని తనకు విశ్వాసం ఉందన్నారు. దళితబంధు ద్వారా అందించే ఆర్థిక సహాయం బ్యాంకు లోను కాదు. తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ఇది ఫలానా పనిచేయాలనే ఒత్తిడి లేదు. వచ్చిన పని, నచ్చిన పనిని చేసుకోవచ్చనే విషయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలోని అధికారులను ఆదేశించారు.

అనుభవాలను వివరించిన కరీంనగర్‌ కలెక్టర్‌

ఇప్పటికే దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలవుతున్న నేపథ్యంలో, క్షేత్ర స్థాయి అనుభవాలను సమావేశానికి వివరించాల్సిందిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ను సీఎం ఆదేశించారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కరీంనగర్ కలెక్టర్, దళిత ప్రజల మనోభావాలను, అధికార యంత్రాంగం అనుభవాలను సమావేశానికి వివరించారు. ఈ సందర్భంగా ఎంపిక కాబడిన మండలాల నియోజకవర్గాల జిల్లాల మంత్రులు ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను సీఎం కేసీఆర్‌ సేకరించారు.

దళిత బంధు పథకం ద్వారా దళిత జాతిని ఆర్థికంగా నిలదొక్కుకునే దిశగా నడిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయ పడ్డారు. సీఎం కేసీఆర్ చేపట్టిన దళిత బంధు పథకం, దళితులను వ్యాపార వర్గంగా మలుస్తుందని సమావేశం విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం ఆలోచనలకు అనుగుణంగా తాము దళితబంధు విజయవంతానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తామని సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana