e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా

దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా

మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైంది. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలు కరోనా కట్టడిలో నిర్లక్ష్య వైఖరి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దాకా విఫలమైంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దేశ జీడీపీని తగ్గించి బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయం కంటే దిగజార్చింది. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, పోస్టల్‌, ఎయిర్‌లైన్స్‌, బొగ్గు గనులు, విశాఖ స్టీల్‌.. మొదలైనవాటిని కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. రోజూ మేమే దేశ భక్తులమని వల్లించే మోదీ భక్త బృందం ఈ దేశ రక్షణ రంగ సంస్థలను కూడా ప్రైవేట్‌పరం చేయడానికి సిద్ధపడింది!

దేశంలో మత, ప్రాంతీయ, వర్గ విద్వేషాలు సృష్టించి మనుగడ సాగించాలనుకునే మోదీ ప్రభుత్వం బలహీన, అల్పసంఖ్యా క వర్గాలపైన దాడులు చేస్తున్నది. దీనివల్ల ఈ వర్గాలేవీ మోదీని విశ్వసించవు. అలాగే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ వాటిని రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొని, తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుని మోదీపై కోపంతో ఉన్నారు. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నరు. పంజాబ్‌, హర్యానా, యూపీ రైతులతో పాటు భారత రైతులు ఇంకా బీజేపీకి ఓటు వేస్తారా?

- Advertisement -

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని 42 ఎంపీ సీట్లలో బీజేపీకి చెప్పుకోదగినంత బలం లేదు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని అనూహ్య పరిస్థితుల్లో గెలిచిన కొద్దిపాటి సీట్లు కూడా ముందుముందు రాకపోవచ్చు.
బీజేపీ ఒక్క స్థానంలోనే ఓ మోస్తరు బలంగా ఉన్నది. తమిళనాడులో స్టాలిన్‌ బలంగా ఉన్నారు. బీజేపీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పట్టు సాధించలేదు

దేశ జనాభాలో దాదాపు 70 కోట్లున్న వెనుకబడిన తరగతులు (ఓబీసీ) కులగణన జరగాలని డిమాండ్‌ చేస్తున్నాయి. నాడు మండల్‌ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అద్వానీ అయోధ్య రథయాత్ర చేపట్టారు. నేడు మోదీ కులగణన వద్దంటున్నరు. మరి ఓబీసీలు బీజేపీకి ఎందుకు ఓటేస్తరు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానిస్తూ, రాజ్యాంగ స్వభావాన్ని మారుస్తామని కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నరు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చాలని కుట్ర చేస్తున్నరు. మరి దళితులు, గిరిజనులు బీజేపీకి ఓటు వేస్తారా? కరోనా కష్టకాలంలో వలస కూలీలకు కనీసం రైలు, బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించలేదు. పేదలను ఆర్థికం గా ఆదుకోలేదు. ఎర్రటి ఎండలో వందల కిలోమీటర్లు నడుస్తుంటే వాళ్ల కాళ్లకు రక్తాలు కారినయి. వీరంతా బీజేపీకి ఓటు వేస్తారా?

ఈశాన్య రాష్ర్టాల్లో మొత్తం 22 ఎంపీ సీట్లున్నా యి.ఈశాన్య రాష్ర్టాల్లో గిరిజనుల మధ్య మత విద్వే షాలను బీజేపీ రెచ్చగొడుతున్నది. వారి సంస్కృ తులను కించపరుస్తున్నది. వారి ఆహారపుటలవాట్లను, వేషభాషలను వెక్కిరిస్తున్నది. మరి ఈశాన్య రాష్ర్టాల ప్రజలు, ఇతర రాష్ర్టాల్లోని గిరిజనులు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారు?

భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి యూపీలో 80 లోక్‌సభ స్థానాలున్నాయి. యోగి పాలనతో యూపీ ప్రజలు విసిగిపోయారు. బీహార్‌లో నలభై లోక్‌సభ సీట్లున్నాయి. యూపీ, బీహా ర్‌ రాష్ర్టాల్లో ఎస్పీ, ఆర్జేడీల నేతృత్వంలో పలు పార్టీ లు సమీకృతమై బీజేపీని సవాల్‌ చేస్తున్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. హర్యానాలో 10, పంజాబ్‌లో 13 ఎంపీ సీట్లు సీట్లున్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీకి అనుకూల పరిస్థితి లేదు. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లున్నాయి. బీజేపీకి మిత్రపక్షమైన శివసేన దూరమైంది. శరద్‌పవార్‌ మార్గదర్శకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి మహారాష్ట్రలో బలంగా ఉన్నది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీని బీజేపీ ఎదుర్కోవ డం దుర్లభం.

తెలంగాణలో కేసీఆర్‌ బలమైన నాయకుడిగా అవతరించారు. వ్యవసాయరంగాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టును కొద్దికాలంలోనే నిర్మించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి సంక్షేమ పథకాలను చేపట్టారు. లోకసభలో బీజేపీ ప్రవేశపెట్టిన రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను టీఆర్‌ఎస్‌ లోక్‌సభలో వ్యతిరేకించింది. ఇటీవల అమరులైన రైతు కుటుంబాలకు ఆర్థికసహాయం ప్రకటించింది. వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని కేసీఆర్‌ పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ దేశంలోనే బలమైన నాయకుడిగా మారారు. దక్షిణాదిన కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ర్టాల్లో 129 ఎంపీ సీట్లున్నాయి. గోవా, మహారాష్ట్రలను కూడా కలుపుకొంటే 179 లోక్‌ సభ సీట్లవుతాయి. దక్షిణాదిలో బీజేపీకి 179 సీట్లలో 25 మించి సీట్లు వచ్చే అవకాశం లేదు.

దేశవ్యాప్తంగా పలు సామాజిక వర్గాలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి లేదు. బీజేపీకి సంప్రదాయ పునాదిగా ఉన్న ఉత్తర, పశ్చిమ రాష్ర్టాల్లోనే ఆ పార్టీ ప్రతిష్ఠ దిగజారింది. ఈ నేపథ్యం లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు. కాగా ప్రాంతీయపార్టీలు బలమైన కూటమిగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పనున్నవి. రాజనీతుజ్ఞడైన కేసీఆర్‌ పలు రాజకీయపార్టీలను ఏకతాటిపై నడిపించడానికి గత ఎన్నికల ముందు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల అనంతరం రాజకీయ పునరేకీకరణ జరిపి దేశ రాజకీయాలను కేసీఆర్‌ మలుపు తిప్పుతారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

బీరయ్య యాదవ్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement