హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష -2026 పేపర్-1 అత్యంత కఠినంగా వచ్చింది. మూడు నాలుగేండ్లతో పోలిస్తే అత్యంత క్లిష్టంగా ఉన్నదని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులకు కఠిన ప్రశ్నలు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురొన్నారు. జనరల్ స్టడీస్ పేపర్లో వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చినప్పటికీ, కరెంట్ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా పాలన(గవర్నెన్స్) సంబంధిత ప్రశ్నలను కేస్ స్టడీ రూపంలో అడగడం వల్ల అవి చాలా పొడవుగా ఉండి, సమయాన్ని ఎకువగా తీసుకున్నాయని అభ్యర్థులు వాపోయారు. సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అంశాలపై కూడా ప్రశ్నలు ఎకువగా వచ్చాయని పేరొన్నారు.
పేపర్-1లో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా.. వాటిలో 27 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, 19 చరిత్ర, సంస్కృతి, 12 భారత రాజ్యాంగం, పాలన, 11 పర్యావరణం, జీవావరణ శాస్త్రం, 10 ఆర్థిక, సామాజిక అభివృద్ధి, 8 సాధారణ విజ్ఞానం, 7 సాధారణ జ్ఞానం, 6 భూగోళ శాస్త్రం నుంచి వచ్చాయి. ఈసారి ప్రశ్నల ధోరణి కోచింగ్ సెంటర్లకు పరిమితమైన సిద్ధతతో సరిపోదని, ప్రామాణిక వనరుల నుంచి కరెంట్ అఫైర్స్‌ను నిరంతరం అధ్యయనం చేసినవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రశ్నలు రూపొందించారని కోచింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇక సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ)గా నిర్వహించిన పేపర్-2 మాత్రం గతంతో పోలిస్తే తేలికగా ఉందని అభ్యర్థులు పేరొన్నారు. చాలా కాలం తర్వాత కమ్యూనికేషన్ సిల్స్, ఇంటర్ పర్సనల్ సిల్స్‌పై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. కాంప్రిహెన్షన్ సులభంగా ఉండగా, గణిత విభాగం హ్యూమానిటీస్ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉన్నట్టు అభిప్రాయపడ్డారు.
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు దాదాపు 15వేల మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయడానికి మొత్తం 44,205 మంది అభ్యర్థులు నమోదుచేసుకున్నారు. వీరిలో పేపర్-1కు 29,609 మంది, పేపర్-2కు 29,262 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 14,943 మంది పరీక్షకు హాజరుకాలేదు. పేపర్-1 జనరల్ స్టడీస్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, పేపర్-2 సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు నిర్వహించారు. అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పేపర్లకు హాజరుకావాలి.
హైదరాబాద్ ఇన్చార్జి కలెక్టర్ సీ నారాయణరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్, సైఫాబాద్‌లోని దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కేంద్రం, మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) త్వరలో తాత్కాలిక ఆన్స్‌ర్ కీని విడుదల చేయనున్నది. ఈ ఏడాది యూపీఎస్సీ మొత్తం 933 ఖాళీలను ప్రకటించగా, గత ఏడాది 979 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమ్స్ ఫలితాలను జూన్ 10లోపు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
జనరల్ : 78
ఈడబ్ల్యూఎస్ : 73
ఓబీసీ : 77
ఎస్సీ : 70
ఎస్టీ : 68
‘నేను ఇప్పటికే మూడుసార్లు ప్రిలిమ్స్ రాశాను. ఈసారి వచ్చిన పేపర్ అత్యంత కఠినంగా అనిపించింది. సుమారు 50కి పైగా ప్రశ్నలకు మాత్రమే నమ్మకంగా సమాధానాలు ఇచ్చాను. మిగతావాటిలో ఊహాపూర్వకంగా సమాధానాలు గుర్తించాల్సి వచ్చింది’ అని హైదరాబాద్‌లోని ఒక కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్థి పీ ఆకాశ్ తెలిపారు.
బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ వీ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రిలిమ్స్ పేపర్-1లో అన్ని విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చినప్పటికీ, కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం ఎకువగా కనిపించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాచీన చరిత్ర, సంస్కృతి నుంచి గతంతో పోలిస్తే అధిక ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. కఠిన ప్రశ్నల దృష్ట్యా ఈసారి అన్ని వర్గాల అభ్యర్థులకు కట్ ఆఫ్ మారులు తగ్గే అవకాశం ఉన్నదని వెల్లడించారు.