అగ్రరాజ్యం అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ స్వతంత్రత విషయంలో మద్దతు తెలిపితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ విషయంలో తలదూరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పని చైనా నేరుగానే హెచ్చరికలు జారీ చేసింది. రష్యా ఎలాగైతే ఉక్రెయిన్‌పై విరుచుకుపడిందో.. అచ్చు అలాగే చైనా కూడా తైవాన్‌పై దాడులకు దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
తైవాన్ చేరుకున్న అమెరికా అధికారుల బృందం
ఈ గొడవ నడుస్తున్న సందర్భంలోనే అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాజీ చీఫ్ మైక్ అడ్మిరల్ నేతృత్వంలో ఐదుగురు అమెరికా సభ్యులు తైవాన్ చేరుకున్నారు. తైవాన్ విదేశాంగ మంత్రి జెసెఫ్ వూ వారికి స్వాగతం పలికారు. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలని చైనా ప్రజలు నిర్ణయించుకున్నారు. తైవాన్‌కు మద్దతివ్వాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలవంతం కాలేవు. వృథా ప్రయాసలే. ఒకే చైనా అన్న సిద్ధాంతాన్నే అమెరికా ఫాలో కావాలని మేం కోరుతున్నాం అంటూ చైనా అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు.