ఇటీవలి కాలంలో చాలా జంతువుల వీడియోలు, ఫొటోలు మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. పెంపుడు కుక్కలు, పిల్లులు చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి. అదిగో అలాంటి ఫొటోలే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు కుక్కపిల్లల పేరిట తెరిచిన ఈ ఇన్స్టాగ్రాం ఖాతాలో ‘లోలోకు కోడిపిల్లలంటే ఇష్టం’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
వాటిలో ఒక ఫొటోలో చిన్న కోడిపిల్ల వచ్చి లోలో నాలుక కొరికింది. దాంతో కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యపోయి కనిపించింది లోలో. ఈ ఫొటో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. లోలో వంటి స్నేహితుడు ఉంటే జీవితం అంతా సరదాగా గడిచిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. మిగతా ఫొటోల్లో కోడి పిల్లలను చూసి లోలో ప్రశాంతంగా నవ్వుతున్నట్లు కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది.