e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News చీటర్‌ అర్వింద్

చీటర్‌ అర్వింద్

ఎంపీగా తప్పుకోవాలంటూ
సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌
అర్వింద్‌ దిష్టిబొమ్మల దహనం
లోక్‌సభలో కీలక చర్చ వేళ..
అడ్రస్‌లేని బీజేపీ ఎంపీ
రాష్ర్టానికి పసుపు బోర్డు లేదని
మళ్లీ స్పష్టం చేసిన కేంద్రం

చీటర్‌ అర్వింద్


హైదరాబాద్‌/ నిజామాబాద్‌, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎంపీగా నన్ను గెలిపిస్తే ఐదురోజుల్లోనే నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకువస్తా. బోర్డు తీసుకురాకుంటే రాజీనామా చేసి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తా’.. ఇదీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పసుపు రైతులకు ధర్మపురి అర్వింద్‌ ఇచ్చిన హామీ. ఇదే విషయాన్ని ఆయన బాండ్‌పేపర్‌పై రాసి సంతకం చేసి మరీ ఇచ్చారు. దీనిని నమ్మిన రైతులు.. అర్వింద్‌ను ఎంపీగా గెలిపించారు. ఆయన గెలిచి నేటికి సరిగ్గా 638 రోజులు. పసుపు బోర్డు తెస్తానన్న ఐదు రోజుల గడువు దాటి రెండేండ్లు కావస్తున్నది. బీజేపీ ఎంపీ మాత్రం పసుపు బోర్డు ఏదని అడిగినప్పుడల్లా.. ‘టైం ఉందిగా’ అంటూ దాటవేస్తూ వచ్చారు. తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంతో రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పాటుకాదనే విషయం తేలిపోయింది. ఎంపీ అర్వింద్‌ బండారం బట్టబయలైంది. దీంతో పసుపు రైతులు, సోషల్‌ మీడియాలో నెటిజన్లు ‘ఛీటర్‌ అర్వింద్‌’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ‘అర్వింద్‌ తప్పుకో.. మాట నిలబెట్టుకోఅంటూ మండిపడుతున్నారు.

అధర్మపురి అర్వింద్‌!
కేంద్రం పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు పసుపు బోర్డు రాదని తేల్చి చెప్పడంతో.. అర్వింద్‌ మోసంపై సోషల్‌ మీడియాలో భారీ ట్రోలింగ్‌ మొదలైంది. ‘నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెస్తానంటూ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి.. ఎన్నికల్లో గెలిచాక మాట తప్పిన మోసగాడు’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ‘చీటర్‌ అర్వింద్‌’ హాష్‌ట్యాగ్‌తో ఎంపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ చేశారు. సుమారు 10 వేల ట్వీట్స్‌తో, రకరకాల మీమ్స్‌తో అర్వింద్‌ను ఆటాడుకున్నారు. ‘ఇచ్చిన మాట తప్పినందుకు మనిషివైతే రాజీనామా చెయ్‌.. నిజామాబాద్‌ రైతులను వెర్రివాళ్లను చేసినందుకు త్వరలో రైతుల నుంచి తప్పకుండా గట్టిదెబ్బ తగులుతుంది’ అంటూ సతీశ్‌రెడ్డి అనే నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ‘రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు అర్వింద్‌?’ అంటూ కొందరు గత ఎన్నికల్లో రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ను పోస్టుచేశారు. బీజేపీ అంటే నో పసుపుబోర్డు, నో ఐటీఐఆర్‌, నో రైల్వేకోచ్‌, నో మెడికల్‌ కాలేజీ అంటూ ట్వీటారు. ‘అధర్మపురి ఎంపీ నిజామాబాద్‌ రైతులకు క్షమాపణ చెప్పి.. వెంటనే రాజీనామా చెయ్‌’ అంటూ మండిపడ్డారు. మరోవైపు మాటతప్పిన ఎంపీ అర్వింద్‌ రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు కదం తొక్కారు. అర్వింద్‌ బండారాన్ని కేంద్ర సర్కారే బట్టబయలు చేసిందంటూ మండిపడ్డారు. ‘ఏడాదిన్నర కాలంగా ఆడిన నాటకాలు చాలు. ఇక ఎంపీ పదవి నుంచి తప్పుకో… మాట నిలబెట్టుకో అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అర్వింద్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి.. నిరసనలు తెలిపారు.

లోక్‌సభలో కనిపించని అర్వింద్
పసుపు బోర్డుపై సోమవారం రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానంపై మంగళవారం లోక్‌సభలో దుమారం రేగింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. పసుపు బోర్డును ఏర్పాటుచేయాల్సిందేనంటూ గళమెత్తారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలూ జతకలిశారు. 2019 ఎన్నికల సమయంలో నిజామాబాద్‌ జిల్లాలో ప్రచారానికి వచ్చిన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌సైతం పసుపు బోర్డుపై హామీలు ఇచ్చారంటూ సభ దృష్టికి తెచ్చారు. ఎన్నిక సమయంలో ధర్మపురి అర్వింద్‌ రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ అంశాన్నీ లేవనెత్తారు. అయితే, పసుపు బోర్డుపై చర్చ జరుగుతున్న సమయంలో అర్వింద్‌ లోక్‌సభలో కనిపించలేదు. సభలో దోషిగా నిలబడాల్సి వస్తుందనే ఢిల్లీలో ఉన్నప్పటికీ సభకు ముఖం చాటేశారని తెలంగాణ ఎంపీలు మండిపడ్డారు.

రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి
ఎంపీ ఎన్నికల సమయంలో బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మరీ ఓట్లడిగతే అందరం నమ్మినం. ఇ ప్పుడు గెలిచి రెండేండ్లు దాటాక పసుపుబోర్డు ఇవ్వబోమని కేంద్రం చెప్తున్నది. అలాంటప్పుడు అర్వింద్‌ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లోకి రావాలి. రైతులను నమ్మించి ఓట్లేయించుకుని మోసంచేసిన ఆయనకు రైతులు సత్తా ఏమిటో చూపించాలి. పసుపుబోర్డు కోసం మా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు.

  • జక్కుల నవీన్‌, సుంకెట్‌

చేతులెత్తేసినట్టే..
పసుపుబోర్డు విషయంలో ఎంపీ అర్వింద్‌ తనతో కాదని చేతులెత్తేసినట్టే. అట్లనే ఎంపీ పదవిని కూడా తనతో కాదని వదులుకోవాలి. రైతులకు హామీ ఇచ్చినప్పుడు కొట్లాడి అయినా పసుపుబోర్డు తీసుకురావాలి. లేకుంటే రాజీనామా చేయాలి. పసుపుబోర్డు కోసం రైతుల ఉద్యమం కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తించాలి.
-లక్ష్మీనారాయణ, రైతు, పాలెం

Advertisement
చీటర్‌ అర్వింద్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement