గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ లక్షణాలను ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు చికిత్స గురించి తెలుసుకుందాం. గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌ను ముందే గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలో ముఖ్యమైనది పాప్‌స్మియర్ టెస్ట్. ఈ పరీక్షలో కణాలు మార్పు చెందుతున్నట్లుగా గుర్తిస్తే, మరిన్ని ఇతర పరీక్షలు, కాల్పోస్కోపి చేస్తారు. అవసరమైతే కొంచెం కాలవ్యవధిలో పాప్‌స్మియర్ పరీక్షలు మళ్లీ మళ్లీ చేసి, కణాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో జాగ్రత్తగా గమనిస్తారు. ఈ పరీక్షల వల్ల క్యాన్సర్‌ను లక్షణాలు కనిపించక ముందే.. చాలా తొలిదశలోనే కనుక్కోగలుగుతారు. కణాల మార్పును చాలా రోజుల ముందే పసిగట్టడం ద్వారా తేలికైన డేకేర్ (daycare) ప్రోసీజర్స్ కొసైజేషన్, క్రయోకాటరైజేషన్, లేజర్ థెరపీ, LEEP వంటి చికిత్సలతో.. మార్పులు చెందిన గర్భాశయ ముఖద్వారంలోని భాగాన్ని కొంతమేరకు తీసివేస్తారు. వీటివల్ల చిన్న వయసులో స్త్రీలకు సంతానభాగ్యం పొందే అవకాశానికి ఎటువంటి ఇబ్బందీ కలుగదు. వయసు పైబడినా, ఒకసారి ప్రొసీజర్స్ తర్వాత కూడా పాప్స్మియర్లలో తేడాలు కనిపిస్తే, రాడికల్ హిస్టరెక్టమీ వంటి సర్జరీలు తప్పనిసరి.
సర్వైకల్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించినప్పుడు, స్త్రీ వయసు తక్కువగా ఉంటే.. గర్భసంచిని తీసివేయకుండా, సర్విక్స్, వజైనా, లింఫ్ నోడ్స్ తీసివేసే రాడికల్ ట్రాకిలెక్టమి చేస్తారు. క్యాన్సర్ దశ, వయసుపై ఆధారపడి గర్భాశయాన్ని, గర్భాశయ ముఖద్వారాన్ని తీసివేసే హిస్టరెక్టమీ, వాటితోపాటు లింఫ్ నోడ్స్ను తీసివేసే రాడికల్ హిస్టరెక్టమి చేయాల్సి వస్తుంది.
ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే ప్రస్తుతం హిస్టరెక్టమీని ల్యాప్రొస్కోపిక్ పద్ధతిలో చేయగలుగుతున్నారు. ఈ సర్జరీ వలన బాధితులు త్వరగా కోలుకోవడమేకాక, తర్వాత ఎక్కువ కాలం ఆగనవసరం లేకుండానే కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు తీసుకోగలుగుతారు. మామూలు సర్జరీ చేసినప్పుడు గాయం మానేవరకు రెండు, మూడు వారాల దాకా ఆగి, తర్వాత చికిత్సను అందించడం జరుగుతుంది. కానీ, ఈ కీ హోల్ సర్జరీలతో వారం రోజుల్లోనే తర్వాతి చికిత్సలు ఇవ్వగలుగుతాం. క్యాన్సర్ కణితిని ఆలస్యంగా గుర్తిస్తే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేసి, తర్వాత సర్జరీ చేస్తారు. ఇంకా నాలుగో దశలో అంటే.. మిగతా భాగాలకు (కాలేయం, ఊపిరితిత్తులు, ఎముకలు, రొమ్ములు)లకు వ్యాపించినట్లు గుర్తిస్తే, కీమోథెరపీ ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
ఏ చికిత్స తీసుకున్నా ఒక్కసారి సర్విక్స్‌లో కణాలు మార్పునకు గురయ్యాయని తెలిస్తే, సర్జికల్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఫాలోఅప్ పరీక్షలు తప్పనిసరి. మొదటి రెండేండ్లు ప్రతి మూడు నెలలకోసారి, తర్వాత ఐదేండ్ల వరకు ఆరు నెలలకోసారి, ఆ తర్వాత ఏడాదికి ఒక్కసారి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే.. మళ్లీ వచ్చే ప్రమాదాన్ని ముందే తెలుసుకోగలుగుతాం. ఒక్కోసారి క్యాన్సర్
చికిత్సలు పూర్తయిన తర్వాత పది, ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించిన సందర్భాలున్నాయి. కాబట్టి, ఫాలోఅప్ కేర్ తప్పనిసరి.
మధ్యవయసు స్త్రీలు రేడియేషన్ చికిత్సల వల్ల మెనోపాజ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫాలోఅప్ కేర్‌తోపాటు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. చిన్న వయసు వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం ఉండవచ్చు. కీమో, రేడియో థెరపీలలో సైడ్ఎఫెక్ట్స్ కొంతకాలమే ఉండవచ్చు. కానీ, చిన్న వయసులో ఊఫరెక్టవా చేయించుకున్న వారికి మెనోపాజ్ లక్షణాలు త్వరగా వస్తాయి. కాబట్టి, హార్మోన్స్, కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ అవసరం. చిన్న వయసులో సర్విక్స్ క్యాన్సర్ వచ్చినవాళ్లకు రాడికల్ సర్జరీ చేసినప్పుడు అండాశయాలను జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది.
తొమ్మిదేండ్లు పైబడ్డ అమ్మాయిలందరికీ తల్లిదండ్రులు మూడు డోసుల వ్యాక్సిన్స్ వేయించడం, డేటింగ్ కల్చర్‌కు దూరంగా ఉంచడం, 21 ఏండ్లు పైబడ్డ స్త్రీలందరూ మూడేండ్లకోసారి పాప్స్మియర్స్లో తేడాలుంటే డాక్టర్ సలహామేరకు నిర్ణయించిన కాలవ్యవధిలో తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు, ధూమపానానికి దూరంగా ఉండటంతో ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చు. చాలామంది పాప్స్మియర్స్ ఒకటి రెండు సార్లు నార్మల్‌గా ఉండగానే.. ఇంక అవసరం లేదులే అని సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయడం వల్ల, లేదా లక్షణాలు కనిపించిన తర్వాత పాప్స్మియర్స్ చేయించుకోవటం వల్ల సర్వైకల్ క్యాన్సర్‌కు గురవుతున్నారు. తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయగలిగే ఈ క్యాన్సర్ పట్ల స్త్రీలందరూ అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421