ఒక కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీయీవో) అంటే మామూలు విషయం కాదు. సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన నిర్ణయాలే కీలకం. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ప్రభావం వల్లే సీయీవో స్థాయి వ్యక్తులు అసలు వయసు కన్నా పెద్దగా కనిపిస్తారనీ, వాళ్ల జీవిత కాలమూ తగ్గుతుందనీ ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన పరిశోధకులు పెద్ద బాసులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిపై అధ్యయనం చేశారు. దాదాపు 1600 మంది సీయీవోల డేటాను సేకరించి వాళ్ల బిజినెస్ హిస్టరీ, ఆరోగ్యం గురించి విశ్లేషించారు. పరిశోధన పూర్తయ్యాక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఒత్తిడికి గురైన సీయీవోల జీవితకాలం మిగిలినవారికంటే 4.5 శాతం తగ్గుతున్నదని తేలింది. అంతేకాదు, వ్యాపారంలో ఒడుదొడుకులు ఎదురు కాకముందు, ఎదురైన తర్వాత.. సీయీవోల ఫొటోలను స్కాన్ చేసినప్పుడు వాళ్లలో వయసుకు మించిన వార్ధక్యం కనిపించింది. ఇదంతా కెరీర్ పరమైన ఒత్తిళ్ల కారణంగానే జరిగిందన్న నిర్ణయానికొచ్చేశారు పరిశోధకులు.