హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కార్ దన్నుతోనే ఏపీ సర్కార్ గోదావరి-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్నది. అవార్డులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టేందుకు సిద్ధమైంది. అందుకు కేంద్ర సర్కార్ విధానాలూ దోహదం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడంతోపాటు ఆర్థిక సాయం అడిగిందే తడవుగా కేంద్రం స్పందించింది. ప్రాజెక్టుపై అధ్యయనానికి వెంటనే పూనుకున్న ది. ఏపీ సీఎం లేఖను సీడబ్ల్యూసీకి పంపింది. దీనికి సీడబ్ల్యూసీ సైతం వెంటనే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాసింది. ఏపీ ప్రతిపాదించిన జీబీ లింక్ ప్రాజెక్టుపై తదుపరి చర్య లు చేపట్టేందుకు సమగ్ర వివరాలు, అభిప్రాయాలు తెలియజేయాలని హుకుం జారీ చేసిం ది. ఆయా సంస్థలు ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధమని, గోదావరిలో మిగులు జలాలే లేవ ని పేర్కొన్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు ఇ చ్చేందుకు సైతం నిరాకరించింది. అయినా, కేంద్రం వాటని బుట్టదాఖలు చేసింది. ప్రాజెక్టుపై పొరుగురాష్ర్టాలు అభ్యంతరాలు చెప్పకుండా తాయిలాలు ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతితోపాటు బెడిది వ రద ప్రాజెక్టు కోసం కర్ణాటకకు, వైతరణి-దమనగంగ-గోదావరి లింక్ కోసం మహారాష్ట్రకు హామీనిచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి సుబోధ్ఘాట్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ సర్కార్‌తో చర్చలకు తెరతీసింది. ఎన్నడూలేని విధంగా జలవివాదాల పరిష్కారం కోసమంటూ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. గుట్టుగా మంతనాలు సాగిస్తున్నది. పాలమూరుకు అనుమతిస్తే నల్లమలసాగర్‌కు తెలంగాణను ఒప్పిస్తామంటూ ప్రతిపాదనలు ముందు కు తెచ్చింది. అంటే కేంద్రం.. ఏపీ కోసం ఎంతగా కృషిచేస్తున్నదో అర్థమవుతున్న ది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీకి అడుగడుగునా వంతపాడుతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీసిన పరిస్థితి లేదు. లేఖలకే పరిమితమైంది తప్ప కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. కేంద్ర చర్యలన్నింటికీ కాంగ్రెస్ సర్కార్ వంతపాడుతున్నది. పాలమూరు డీపీఆర్ వెనక్కి వచ్చినా నోరుమెదకపోవడం, 45 టీఎంసీలకు నీటి కోటా కుదించడం, బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు మొగ్గుచూపడమేకాదు, ఏపీతో, కేంద్రంతో చర్చలకు పరుగులు పెట్టడమే ఇందుకు అద్దం పడుతున్నది. కేంద్ర సంస్థలు, ఏపీ కుట్రలపై తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు నోరుమెదపడం లేదు. ఇక బనకచర్లనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మొదటినుంచీ బీఆర్ఎస్ బరిగీసి కొట్లాడుతున్నది. కేసీఆర్ పట్టువదలని పోరాటం ఫలితంగా ట్రిబ్యునల్ కల సాకారమైంది. తాజాగా బనకచర్ల ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న గులాబీశ్రేణులే. హక్కుల కోసం కాంగ్రెస్, బీజేపీ సర్కార్లను నిలదీస్తున్నది.