సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశ, విదేశీ పిల్లులన్నీ ఒకే చోట చేరి సందడి చేశాయి. అందమైన ఆహార్యం.. పదునైన చూపులతో కట్టిపడేశాయి. మియాం మియాం అంటూ మైమరపింపజేశాయి. క్యాట్స్ సందడికి మాసబ్‌ట్యాంక్‌లోని వెట్స్ హోం వేదికైంది. ‘క్యాట్ షో-ఆల్ బ్రీడ్ ఫన్ షో-2021’ పేరుతో జరిగిన పిల్లుల ప్రతిభ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. వెట్స్ సొసైటీ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ద ఫ్లైన్ క్లబ్ ఆఫ్ ఇండియా, మార్స్ పెట్‌కేర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాట్ షోకు ముఖ్య అతిథిగా పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఎస్.రామచంద్ర హాజరయ్యారు. సుమారు 150 పిల్లులు ఈ షోలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి.
మెయిన్కూన్, బెంగాల్, బ్రిటిష్ షాట్హెయిర్, సైబేరియన్స్, ఇండిమౌ తదితర జాతి పిల్లులు క్యాట్షోలో పాల్గొన్నాయి. కిడిన్, అడల్డ్ గ్రూపులుగా విడగొట్టి.. గ్రూమింగ్, స్పందన, లుక్, హెల్త్ తదితర అంశాల ఆధారంగా నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఒక్కో క్యాట్‌ను స్టేజీ మీదికి తీసుకు వచ్చి పరీక్షించారు. ఒక్కో అంశానికి మార్కులు కేటాయించారు. మొత్తం మూడు రౌండ్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన పిల్లులను న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ద ఫ్లైన్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సాకిబ్ పథాన్, అతడి జట్టు సభ్యులు విజేతలుగా ప్రకటించి బహుమతులతో పాటు పెట్ ఫుడ్‌ను ఉచితంగా అందజేశారు.
మార్స్ ఇంటర్నేషనల్ ఇండియా లెక్కల ప్రకారం నగరంలో వివిధ జాతులకు చెందిన సుమారు 45 వేలకు పైగా పిల్లులు ఉన్నాయని.. వీటి పోషణకు చేసే ఖర్చు సుమారు నెలకు రూ.2 కోట్ల పై మాటేనని.. ఇతర గ్రూమింగ్ సెలూన్ సెంటర్లు, మెయింటెనెన్స్, హెల్త్‌తో కలిపితో మరో కోటి రూపాయలు అవుతాయని మార్స్ ఇండియా మేనేజర్ డాక్టర్ జిగ్వాల్ హాక్ ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు. ఇంటర్నేషనల్ క్యాట్ అసోసియేషన్ (టీకా) 71 జాతులను గుర్తించింది. వాటి సంరక్షణకు కావల్సిన ఉత్పత్తులను పెట్ కర్ కంపెనీలు కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఫుడ్, న్యూట్రిషన్, పెట్ ఫార్మాసిటికల్స్, పెట్ గ్రోమింగ్ ఉత్పత్తులను నిర్వాహకులు ఈ షోలో అందుబాటులో ఉంచారు.
జంతువులను చేరదీసి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా పెంచుకోవడం గొప్ప విషయం. వాటికి ఏదైనా సమస్య వస్తే మాత్రం రోడ్డుపై విడిచిపెట్టవద్దు. పూర్తి సంరక్షణ బాధ్యతలు తీసుకొని కంటికి రెప్పలా కాపాడాలి. జంతు సంరక్షణకు కృషి చేస్తున్న సంస్థలకు అభినందనలు. పెంపుడు జంతువులను దత్తత తీసుకునే కల్చర్ ఇంకా పెరగాలి. క్యాట్ షో నిర్వహించి జంతువుల సంరక్షణపై ఉన్న అపోహలను తొలగించడం మంచి పరిణామం.- ఎస్. రామచంద్ర, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ
సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పెంపుడు జంతువుల సంరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడమే అతడి లక్ష్యం. ముఖ్యంగా పిల్లుల సంరక్షణకు ప్రత్యేకంగా కృషి చేస్తాడు. నగరంలో ఏ పెట్ ఈవెంట్ జరిగినా ముఖ్య అతిథిగా హాజరవుతాడు. ఆదివారం నగరంలో జరిగిన క్యాట్ షోకు న్యాయనిర్ణేతగా విచ్చేసిన ఎఫ్‌సీఐ( ద ఫెలెన్ క్లబ్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు సాకిబ్ పథాన్ను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా పిల్లుల ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
పిల్లులను పెంచుకోవడానికి ఇప్పటికీ అనేక మంది ఆలోచిస్తారు. ఇది అశుభమనే భావన ఉంది. భవిష్యత్‌లో పిల్లి పూర్తిస్థాయి సాధు జంతువుగా ఉండబోతుంది. పిల్లుల పెంపకంపై విద్యావంతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల జంతుజాతులను పట్టించుకోకపోవడంతో అవి కనుమరుగయ్యాయి. నేను మెకానికల్ ఇంజినీర్‌ను. నాకు పిల్లులంటే ప్రాణం. అందుకే వాటి జాతులు అంతరించి పోకుండా డీఎన్ఏ, ఎముకల అమరిక, ఇతర వివరాలను సేకరించి డాక్యుమెంటరీ చేస్తున్నా. రాబోయే తరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. దేశ, విదేశాల్లో క్యాట్ షోలు నిర్వహిస్తూ పిల్లుల దత్తత పెరిగేలా కృషి చేస్తా. 2050 నాటికి శునకాలు, పిల్లులు సమానంగా ఉండేలా చూడాలనుకుంటున్నాం. ఇందుకోసం దత్తతను ప్రోత్సహిస్తున్నాం. దేశంలో సుమారు 2.5 కోట్ల పెంపుడు జంతువులుంటే అందులో 1.80 కోట్ల శునకాలు ఉన్నాయి. పెంపుడు జంతువుల సంరక్షణపై వాటి యజమానులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఆనందంగా ఉంది. గతంలో ఫ్లైన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైటెక్స్‌లో పెట్ ఎక్స్ పోలో ఏర్పాటు చేశాం. 250 పిల్లులతో ప్రదర్శన నిర్వహించాం. అత్యత ఖరీదైన జాతులను అందుబాటులో ఉంచాం. త్వరలో పిల్లుల దత్తత కేంద్రాలను హైదరాబాద్‌లో తెరవనున్నాం. పిల్లుల సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. వెటనరీ విద్యార్థులు, వైద్యులు, జంతు సంరక్షకులతో కలిసి ‘భవిష్యత్తులో సాదు జంతువు పిల్లి’ అనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
జంతువులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. జంతు ప్రేమికులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పిల్లల దత్తతపై అవగాహన కల్పించాం. పిల్లి అంటే అశుభం అనే భావన క్రమక్రమంగా తొలగిపోతున్నది. ప్రస్తుతం అనేక మంది పిల్లులను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. -డాక్టర్ మురళీధర్, వెట్స్ సొసైటీ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అండ్ రూరల్
నాకు పిల్లులంటే చాలా ఇష్టం. నేను పెంచుకుంటున్న పిల్లి పేరు రూసి. ఈ షో నాకెంతో నచ్చింది. ఇక్కడ విభిన్న రకాల పిల్లులను చూడటం ఆనందంగా ఉంది. నేను పెంచుకుంటున్న పిల్లికి శిక్షణ ఇప్పించి పోటీల్లో పాల్గొంటా. భవిష్యత్‌లో మరిన్ని షోలను నిర్వహించాలని కోరుకుంటున్నా. -ఫాతిమా, జంతు ప్రేమికురాలు
మా ఇంట్లో నాలుగు పిల్లులను పెంచుకుంటున్నాం. అంతేకాక రోడ్డు మీద కనిపించే పిల్లులను చేరదీసి పెంచుకోవాలనుకునే వారికి ఉచితంగా ఇచ్చేస్తున్నాం. కొంతమంది పెంచుకుంటున్న పిల్లులను వదిలేయడం ఇష్టం లేక మాకు అప్పగిస్తున్నారు. మేం వాటిని ఇతరులకు అప్పగిస్తున్నాం. మొత్తంగా పిల్లులకు కష్టాలు తేవద్దన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – ఎం. ధన్వంతర్, పెట్ ప్రేమికుడు
మాది పర్షియన్ జాతికి చెందిన పిల్లి. చిన్న పిల్లుల పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది. క్యాట్ షోలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక ద్వారా అనేక విషయాలను నేర్చుకున్నాం. మరోసారి అడల్ట్ క్యాట్ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతాం. పిల్లుల సంరక్షణ, ఆహారంపై నిర్వాహకులు అవగాహన కల్పించడం బాగుంది. – మహ్మద్ అబ్దుల్ నజీర్, పెట్ ఓనర్
మేము పెంచుకుంటున్న పిల్లి పేరు లూన. మా కుటుంబ సభ్యుల కంటే అది అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఇంట్లో ఎవరూ లేకున్నా అది ఉంటే ఎంతో ధైర్యం అనిపిస్తుంది. దాని సంరక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏ చిన్న గాయమైనా వైద్యశాలకు తీసుకు వెళ్తాం. క్యాట్ షోలో వివిధ రకాల పిల్లులను చూడటం సంతోషంగా ఉంది. ఇలాంటి షోలతో ప్రతిఒక్కరికి పిల్లులంటే అభిమానం పెరగడం ఖాయం. – ప్రణీత, జంతు ప్రేమికురాలు