e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News కాసుల గని

కాసుల గని

  • ఏడాది లక్ష్యంలో అక్టోబర్‌ నాటికే సగానికిపైగా రాబడి
  • సీనరేజ్‌ చార్జీల రూపంలో రూ.20.99కోట్ల ఆదాయం
  • మన ఖనిజ సంపదకు విదేశాల్లోనూ ఫుల్‌ డిమాండ్‌
  • నిర్మాణ రంగం జోరుతో గనులు, భూగర్భ శాఖకు పెరిగిన ఇన్‌కమ్‌
  • అక్రమాలకు పాల్పడితే కేసులు, జరిమానాలు
  • జిల్లాలో గనులు 99
  • ప్రస్తుతం నడుస్తున్నవి 69
  • 2020-21 లీజు 42.49కోట్లు
  • 2021-22 లక్ష్యం 28కోట్లు
  • 7 నెలల్లో వచ్చింది 20.99కోట్లు

జిల్లాలోని ఖనిజ సంపద ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌తో రెండేండ్లుగా విక్రయాల జోరు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 5 నెలల సమయం మిగిలి ఉండగానే, రూ.20.99కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని సగానికి పైగా లక్ష్యాన్ని గనులు, భూగర్భ శాఖ చేరుకున్నది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా క్వార్ట్‌ గ్రానైట్‌, కంకర పరిశ్రమలు 69 నడుస్తున్నాయి. వర్షాలు, కొవిడ్‌ ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ రంగం పురోగమిస్తున్నదనడానికి ఈ పెరిగిన ఆదాయమే నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. గనులు, భూగర్భ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో పారదర్శకత పెరిగి ఆదాయ వృద్ధికి కలిసివస్తున్నదని విశ్లేషిస్తున్నాయి.

ఒకప్పుడు…

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో గ్రానైట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే మామూళ్లు సమర్పించుకున్నా ఏడాది కాలం పట్టేది. అయినా అనుమతి వస్తుందన్న గ్యారంటీ ఉండేది కాదు. గనులు,
భూగర్భ శాఖపై ఆరోపణలు వెల్లువెత్తేవి. లీజుదారులతో అధికారులు కుమ్మక్కై పరోక్షంగా అక్రమాలను ప్రోత్సహించడంతో సర్కారు ఆదాయానికి సైతం గండి పడేది.

ఇప్పుడు..

ఎంత భారీ గ్రానైట్‌ పరిశ్రమ ఏర్పాటుకైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు. ఎవరి చేతులూ తడుపాల్సిన పని లేకుండానే, నెలల వ్యవధిలోనే అనుమతులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టి.. పర్మిషన్‌, లీజు రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌ చేసింది. అనుమతులు ఒక చోట పొంది, మరొక చోట తవ్వకాలు జరుపకుండా, పొందిన అనుమతుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఖనిజాన్ని వెలికితీయకుండా డీజీపీఎస్‌ ట్రాక్‌ సర్వే చేపడుతున్నది.

యాదాద్రి భువనగిరి, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రిభువనగిరి జిల్లావ్యాప్తంగా 99వరకు క్వార్జ్‌, గ్రానైట్‌, కంకర పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 69మాత్రమే పని చేస్తున్నాయి. 81కంకర పరిశ్రమలకు గాను 59, పది బ్లాక్‌ గ్రానైట్‌ గనులకు గాను ఐదు, ఆరు కలర్‌ గ్రానైట్‌ గనుల్లో నాలుగు, రెండు క్వార్ట్‌ల్లో ఒకటి మాత్రమే పనిచేస్తున్నాయి. కంకర పరిశ్రమల నుంచి హెక్టారుకు రూ.50వేలు, కలర్‌ గ్రానైట్‌ గనులకు రూ.80వేలు, బ్లాక్‌ గ్రానైట్‌ గనులకు రూ.లక్ష చొప్పున లీజు రూపంలో ప్రభుత్వం ఆయా యజమానుల నుంచి వసూలు చేస్తున్నది.

ఉత్పత్తులు.. ఆదాయం

జిల్లా గనుల శాఖ రెండేండ్ల కాలంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లాలోని గనుల్లో ఖనిజాల ఉత్పత్తులు పెరగడంతో అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. జిల్లాలోని ఖనిజానికి దేశ, విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉండడం కొండపోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాలకు ముడి సామగ్రిని జిల్లా నుంచే తరలించడంతో జిల్లా గనులు, భూగర్భ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020-21సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.42.49కోట్ల భారీ ఆదాయం లభించింది. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి రూ.28కోట్ల లక్ష్యాన్ని విధించుకోగా సంబంధిత శాఖకు ఏప్రిల్‌- అక్టోబర్‌ మాసం నాటికే రూ.20.99కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే ఇంత మొత్తం ఆదాయం రావడంతో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంటామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

అనుమతుల్లో పారదర్శకత

ఒకప్పుడు గనులు, భూగర్భ శాఖ అవినీతికి ఆలవాలంగా ఉండేది. అధికారులు లీజుదారులతో కుమ్మక్కై పరోక్షంగా అక్రమాలను ప్రోత్సహించడంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీగా గండిపడేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసింది. పెద్ద ఎత్తున తెచ్చిన సంస్కరణలు, మార్పులు, పారదర్శక విధానాలు ఈ శాఖ ఆదాయం వృద్ధికి దోహదపడ్డాయి. అనుమతులు, లీజుల రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అనుమతులు ఒకచోట పొంది మరోచోట తవ్వకాలు జరపడం పొందిన అనుమతుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఖనిజాన్ని వెలికితీయడం వంటి ఉదంతాలకు చెక్‌ పెట్టేందుకు డీజీపీఎస్‌ ట్రాక్‌ సర్వేను చేపడుతున్నారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గనుల తవ్వకాలు, తరలింపుపై పక్కా నిఘా ఉండి అక్రమాలు తగ్గాయి. దీంతో పాటు గ్రానైట్‌ రవాణాకు సంబంధించి తనిఖీలు పెరగడంతో అక్రమ రవాణాకు సైతం చాలావరకు అడ్డుకట్ట పడింది. ఖనిజాల అక్రమ రవాణాకు సంబంధించి ఈ ఏడాదిలో ఏడు నెలల కాలంలోనే 162కేసులు నమోదు చేసి రూ.32.81లక్షలను జరిమానాల రూపంలో వసూలు చేశారు. ఇందులో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించే నమోదైన 13కేసులతో రూ.26.23లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

రూ.18.13కోట్లతో జీవన ప్రమాణాల మెరుగుకు చర్యలు

గనులు, భూగర్భ శాఖ ఖజానాకు భారీగా వచ్చి చేరుతున్న ఆదాయం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సైతం దోహదపడుతున్నది. గనుల యజమానులు ఏటా ప్రభుత్వానికి చెల్లించే సీనరేజ్‌ చార్జీపై 30శాతాన్ని ‘జిల్లా ఖనిజ సంక్షేమ నిధి’కి జమ చేస్తారు. ఈ నిధులతో మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు గాను పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుకు చర్యలు చేపడతారు. జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఖనిజ కమిటీ సభ్యుల సూచనల మేరకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ నిధుల కేటాయింపు జరుగుతున్నది. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణ రోడ్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమాల అమలుకు సంబంధించి 314ప్రాజెక్టులతో రూ.18.13కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనుల ప్రతిపాదనలకు ఆమోదం లభించగా ఇప్పటివరకు 173ప్రాజెక్టుల పనులు పూర్తవగా మిగతావి పురోగతిలో ఉన్నాయి.

మరో 232పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు

జిల్లాలో ఖనిజ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కొత్తగా ప్రభుత్వానికి 232 దరఖాస్తులు ఔత్సాహికుల నుంచి వచ్చాయి. ఇందులో 197కంకర పరిశ్రమలకు సంబంధించినవి కాగా 14 బ్లాక్‌ కలర్‌, 8 కలర్‌ గ్రానైట్‌ పరిశ్రమలు, 13క్వార్జ్‌ పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నా యి. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసీ వచ్చిన వెంట నే అనుమతులు కల్పించేలా గనులు, భూగర్భ శాఖాధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నది.

ప్రతియేటా ఆదాయం వృద్ధి

ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా తెలంగాణలో ఆదాయ వృద్ధి కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం గనులు, భూగర్భ శాఖలో భారీ సంస్కరణలతో అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో జిల్లాలో గనుల లీజు రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇదే ఒరవడి కన్పిస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement