జైపూర్: రెండు తలల దూడ జనాన్ని ఆకట్టుకొంటున్నది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న ఈ అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలోని పుర శిక్రౌడ గ్రామంలో ఆగస్ట్ 30న ఒక గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు మెడలు, రెండు తలలు, చెరో తలకు ముక్కు, రెండేసి కళ్లు, చెవులు ఉన్నాయి. ఈ దూడ ఆరోగ్యంగానే ఉన్నదని యజమాని తెలిపారు. రెండు నోళ్లతో పాలు, నీరు తాగుతున్నదని చెప్పారు.
కాగా, పశువైద్యుల అవసరం లేకుండానే సోమవారం ఆ గేదె ఈ అరుదైన రెండు తలల దూడను ఈనిందని పశువైద్యుడు గుడ్డే సింగ్ తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్ల రెండు తలలతో పుట్టిన ఈ దూడ పూర్తి ఆరోగ్యంతో సాధారణంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మరోవైపు ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు, పరిసర గ్రామస్తులు అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.