భోపాల్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే రామ్భాయి సింగ్ భర్త గోవింద్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. 2019లో జరిగిన కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గోవింద్ సింగ్ను పోలీసులు బింద్ జిల్లాలో ఓ బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే భర్త ఆచూకీ చెబితే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు పోలీసులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దామోహ్ జిల్లాలోని పతారియా బీఎస్పీ ఎమ్మెల్యే రామ్భాయి సింగ్. ఈమె భర్త గోవింద్ సింగ్. 2019లో జరిగిన కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా హత్య కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు.
కేసు విచారణ సందర్భంగా పోలీసుల నిష్క్రియాపరత్వంపై సీరియస్ అయిన సుప్రీం తక్షణమే గోవింద్ సింగ్ అరెస్టుకు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న గోవింద్ సింగ్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఆదివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.