శ్రీనగర్, ఏప్రిల్ 28: జమ్ముకశ్మీర్‌లోని ఎల్వోసీ వెంబడి మారుమూల ప్రాంతంలో విధుల్లో ఉన్న జవాన్ తన పెండ్లి కోసం సకాలంలో ఇంటికి చేరేందుకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రత్యేక హెలికాప్టర్ నడిపింది. మచిల్ సెక్టార్‌లోని ఎత్తయిన ప్రదేశంలో 30 ఏండ్ల కానిస్టేబుల్ నారాయణ బెహరా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వివాహం మే 2న జరుగనున్నది. ఒడిశాలోని దెంకనల్ జిల్లా ఆదిపూర్ అతడి స్వగ్రామం. సుమారు 2,500 కిలోమీటర్లు. నియంత్రణ రేఖ పోస్టు మంచుతో కప్పబడి ఉన్నందున, కశ్మీర్ లోయతో దానికి రహదారి లింకు అందుబాటులో లేదు.
ఈ ప్రాంతాల్లో గస్తీకాసే భద్రతా సిబ్బందికి మిలిటరీ ఎయిర్ మార్గం ఒక్కటే అవకాశం. ఈ నేపథ్యంలో జవాన్ తల్లిదండ్రులు వివాహ విషయాన్ని యూనిట్ కమాండర్స్ దృష్టికి తీసుకెళ్లారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజబాబు సింగ్ ఆదేశంతో చీతా హెలికాప్టర్ ద్వారా గురువారం ఉదయం బెహరాను శ్రీనగర్‌లో దింపారు. బెహరా ప్రస్తుతం తన స్వగ్రామానికి ప్రయాణం సాగిస్తున్నారు. సైనికుల సంక్షేమమే తమ మొదటి, అత్యంత ముఖ్యమైన అంశమని ఐజీ సింగ్ తెలిపారు.