Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా తిరిగారు. దుర్మార్గమైన రీతిలో ఎన్నికలు నిర్వహించారు అని ఆయన అన్నారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఆమె పిల్లలను బెదిరించారు. 139 డ్రోన్లు పెట్టామన్నారు.. సందు సందులో గూండాలున్నారు. అయినా కూడా యువకులు, మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లో రాయలసీమ, బీహార్ మాదిరిగా అరాచకం జరిగింది. ఈ ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. లక్ష మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డబ్బు వద్దన్న ఓటర్లను బెదిరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఉందా..? లేదా..? 20 సార్లు ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించలేదు. మంత్రులందరూ ఎలక్షన్ రూల్స్‌ను ఉల్లంఘించారు అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే వందల మంది దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నేతలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇటువంటి ఎన్నిక గతంలో ఎన్నడూ చూడలేదు. రేవంత్ రెడ్డికి ప్రజల మీద నమ్మకం పోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేశాడు. తెలంగాణలో రౌడీయిజం చూపించబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ గుడ్డి గుర్రంలా తయారైంది. ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజీపీ, సీపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారారు. స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారని చెప్పినా పట్టించుకోలేదు. పారామౌంట్ కాలనీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టేబుల్స్ తీసేశారు. ఒక్క కాంగ్రెస్ నేతపైన అయినా దాడి జరిగిందా..? తప్పుడు ఐడీ కార్డులతో వస్తున్నారు చెక్ చేయమన్నా స్పందన లేదు. పోలింగ్ బూతుల్లో బీఆర్ఎస్ ఏజెంట్లను సైతం బెదిరించారు. బీఆర్ఎస్ నేతలపై అడుగడుగునా దాడులు జరిగాయి. బిర్యాని పొట్లాల్లో డబ్బులు పెట్టి ఇస్తున్నారని చెప్పినా పట్టించుకోలేదు. ఒక్కరి మీదైనా చర్యలు తీసుకొమ్మని సుదర్శన్ రెడ్డిని బతిమిలాడిన కూడా స్పందించలేదని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.