ఒకప్పుడు సినిమా వినోదం. ఇప్పుడు ప్రతి సినిమా ఏదో ఒక వివాదం. ఒకప్పుడు సినిమా నచ్చితే ఒకటికి రెండుసార్లు చూసేవాళ్లు. ఇప్పుడు ఫలానా సినిమాను ఎవరూ ససేమిరా ఆదరించొద్దని రచ్చ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వెండితెరపై కత్తిగట్టారు కొందరు. కళారంగానికి మతం రంగు పులిమి అభిమతాలను రెచ్చగొడుతున్నారు. బాయ్‌కాట్ బాలీవుడ్ పేరుతో హిందీ చిత్రాలను టార్గెట్ చేస్తున్నారు.
నిర్మాతకు భయం.. సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా సైతం ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటుందోనని! దర్శకుడికి భయం.. తన సృజనాత్మకతను ఎవరెలా వక్రీకరిస్తారో అని!! ఈ భయాలే బాలీవుడ్‌ను ఇప్పుడు కుదిపేస్తున్నాయి. ఎంతలా అంటే నెటిజన్ల విమర్శలకు సదరు సినిమాలు విడుదలకు ముందే ఫ్లాప్ జాబితాలోకి చేరిపోతున్నాయి! ఈ బాయ్‌కాట్ ట్రెండ్ వెనుక హేతుబద్ధమైన కారణాలేం కనిపించవు. మతం ముసుగులోనో, మరేదో కారణంతోనో కొన్ని శక్తులు పనిగట్టుకొని కళారంగానికి కొత్త రంగులు పులుముతున్నాయి. సినిమా కంటెంట్ విషయంలో తప్పులుంటే అభ్యంతరాలు చెప్పడంలో తప్పులేదు.
ఒక వర్గం మనోభావాలను కించపరిచే విధంగా ఉంటే ఆ సన్నివేశాలను తొలగించమని డిమాండ్ చేయడమూ సరైనదే! కానీ, గతంలో నటీ నటులు చేసిన వ్యాఖ్యలను తిరగదోడి దాడికి దిగుతున్నారు. వారు నటించిన సినిమాను ఎవ్వరూ చూడొద్దంటూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఒకవైపు, నిర్మాణ వ్యయం పెరిగి మరోవైపు సతమతమవుతున్న సినిమా ఇండస్ట్రీని తాజాగా బాయ్‌కాట్ బూచి బెదరగొడుతున్నది. లాల్‌సింగ్ చడ్ఢ్డా, బ్రహ్మాస్త్ర, లైగర్, రక్షాబంధన్ తదితర సినిమాలు బాయ్”కాటు’కు గురవ్వడం వెనుక గోరంత కారణాలే కొండంతగా కనిపిస్తాయి.
అప్పుడు మొదలు..
బాయ్‌కాట్ ట్రెండ్ ఈ మధ్య ఊపందుకున్నా రెండేండ్ల కిందటే పురుడు పోసుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతితో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి) సుశాంత్ సింగ్‌ను బలి తీసుకుందని ఆగ్రహించారు. సామాజిక మాధ్యమాల్లో #బాయ్‌కాట్ కరణ్ జోహార్, #బాయ్‌కాట్ బాలీవుడ్ అని క్యాంపెయిన్ నిర్వహించారు. సుశాంత్ మృతి కేసు చిక్కుముళ్లుపడే కొద్దీ వివాదాలు సోషల్ మీడియాలో ఇంతలంతలు అవుతూనే వచ్చాయి.
ఈ క్రమంలో వారసత్వాన్ని నమ్ముకొని బాలీవుడ్లో పాతుకుపోయిన ఎందరో హీరోలు, హీరోయిన్లు విమర్శలు ఎదుర్కొన్నారు కూడా! బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్, జాకీష్రాఫ్ కొడుకు టైగర్‌ష్రాఫ్, సైఫ్ కూతురు సారా అలీఖాన్, శత్రుఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా తదితర నట వారసులు ఈ జాబితాలో ఉన్నారు. సుశాంత్ ప్రేమాయణం వెనుక కూడా బాలీవుడ్ పెద్దల హస్తముందన్న విమర్శలూ వచ్చాయి. ముఖ్యంగా సుశాంత్ విషయంలో కరణ్ జోహార్ వ్యవహార శైలిని తప్పుగా చూపించడంలో నెటిజన్లు విజయవంతం అయ్యారు. ఆయన ట్విటర్ ఖాతాను గంటల వ్యవధిలో వేలాది మంది అన్‌ఫాలో అవ్వడమే ఇందుకు నిదర్శనం.
దక్షిణాది చిత్రాలకూ..
మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘పీఎస్-1’ వివాదాల్లో పడింది. ఈ చిత్రంలో చోళ రాజులు కాషాయ దుస్తులు ధరించారని తమిళనాట కొందరు బహిరంగ విమర్శలు చేశారు. వారి కాలం నాటికి తమిళనాట శైవం, వైష్ణవం శాఖలుగా ఉన్నాయనీ, హిందూ ధర్మం అప్పటికింకా ఉనికిని చాటుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లకు అతీతంగా ‘పీఎస్-1’ రికార్డు కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. ‘ఆదిపురుష్’ టీజర్‌పై రకరకాల కామెంట్లు వెల్లువెత్తాయి. గ్రాఫిక్స్ పనితనం సరిగ్గా లేదని కొందరంటే, సినిమాలో రావణుడిగా నటించిన సైఫ్ ఆహార్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు మరికొందరు. భారత్‌పైకి దండెత్తిన తైమూర్ ఖాన్ పేరును సైఫ్ తన కొడుక్కు పెట్టుకున్నాడని, అలాంటి వ్యక్తిని రావణ పాత్రకు ఎలా ఎంచుకుంటారని మండి పడుతున్నారు. అయితే, అతణ్ని ఆ పాత్రకు ఎంచుకుంది దర్శకుడు ఓం రౌత్!
ఇప్పుడు మరోలా..
సుశాంత్ వివాదం తర్వాత మరుగునపడిన బాయ్‌కాట్ అంశం.. ఇటీవల మళ్లీ పుట్టుకొచ్చింది. సుశాంత్ విషయంలో వెల్లువెత్తిన వ్యతిరేకత అభిమానుల నుంచి సహజంగా వచ్చింది. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న బాయ్‌కాట్ ట్రెండ్‌ను అసహజంగా రాజేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కక్ష గట్టి సినిమాలను వెలి వేస్తున్నా.. కిమ్మనకుండా ఉండిపోతున్నారు బీటౌన్ పెద్దలు. అందుకూ కారణం లేకపోలేదు. ఈ వివాదంపై స్పందిస్తే ఎక్కడ తమను బాయ్‌కాట్ చేస్తారో అని భయంతో మిన్నకుండిపోతున్నారు. ఇటీవల ‘లాల్‌సింగ్ చడ్ఢా’ సినిమా చూసి బాగుందంటూ హృతిక్ రోషన్ కితాబిచ్చాడో లేదో మరో బాయ్‌కాట్‌కు శ్రీకారం చుట్టారు నెటిజన్లు. హృతిక్ నటించిన ‘విక్రమ్ వేద’ సినిమాను వెలివేయాలంటూ గేలి చేశారు.
బాయ్‌కాట్ లాల్
ఆమిర్‌ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చడ్ఢా’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్లు వసూలు చేయడంలో విఫలమైంది. ఐక్యూ తక్కువగా ఉన్న వ్యక్తిని ఆర్మీలో ఎలా తీసుకుంటారని కొందరు పెదవి విరిచారు. దీనికితోడు ఆమిర్‌ఖాన్ 2015లో చేసిన వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తెచ్చి బాయ్‌కాట్ వరకూ మోసుకెళ్లారు.
‘మనది సహనశీల దేశం. కానీ, కొందరు దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నారు’ అని గతంలో వ్యాఖ్యానించాడు ఆమిర్. ఆయన మాజీ భార్య కిరణ్ రావు ‘మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశం వీడటమే మంచిదేమో’ అని కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకొని ‘లాల్‌సింగ్ చడ్ఢా’ను చెడ్డ సినిమాగా అభివర్ణిస్తూ బాయ్‌కాట్ చేశారు. 2015 తర్వాత ఆమిర్‌ఖాన్ నటించిన సినిమాల్లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించినవీ ఉన్నాయి, ఫ్లాప్ అయినవీ ఉన్నాయి. అప్పుడు చేయని బాయ్‌కాట్.. ‘లాల్‌సింగ్..’ విషయంలో ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కథాకథనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే సినిమా వైఫల్యానికి కారణం అని కొందరి విశ్లేషణ. అంతేకానీ, బాయ్‌కాట్ అని పిలుపునిచ్చినంత మాత్రాన మంచి సినిమాకు ఆదరణ తగ్గదని సినీ పండితులు చెబుతున్నారు.
‘బ్రహ్మాస్త్ర’పై పనిచేయలేదు..
ఇదే బాయ్‌కాట్ అస్త్రం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంపైనా ప్రయోగించారు నెటిజన్లు. హిందూ ధర్మం, ఒక దివ్యాస్త్రం ఇతివృత్తంగా నిర్మించిన చిత్రాన్ని కూడా బాయ్‌కాట్ చేయడం ఆశ్చర్యం కలిగించినా.. అందుకువారు వెతుక్కున్న కారణం వేరు. గతంలో ఎప్పుడో ‘బీఫ్ ఇష్టంగా తింటాను’ అన్న రణ్‌బీర్ మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేసి మరీ ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’కు పిలుపునిచ్చారు. కానీ, మొదటి రెండు రోజులు స్తబ్ధుగా ఉన్న థియేటర్లలో మూడో రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిసింది. మొత్తానికి బ్రహ్మాస్త్రపై నెటిజన్ల శరం పనిచేయలేదు.
కంటెంట్ ఉంటేనే..
బాలీవుడ్‌ను శాసించాలని కొన్ని అతివాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సినీజనాలు వాపోతున్నారు. తమ ఎత్తులను వేగంగా పారించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. నెటిజన్ల ద్వారా ‘బాయ్‌కాట్’ ట్రెండ్‌కు ఆజ్యం పోస్తున్నారని పేర్కొంటున్నారు.
‘లాల్‌సింగ్..’తోపాటు విడుదలైన ‘రక్షాబంధన్’ సినిమానూ చూడొద్దంటూ క్యాంపెయిన్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సంప్రదాయాలను తప్పుగా చూపారంటూ విమర్శించారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ‘లైగర్’ సినిమా కూడా బాయ్‌కాట్‌ను ఎదుర్కొంది. హీరో విజయ్ దేవరకొండ దురుసు ప్రవర్తనే ఇందుకు కారణంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ రెండు సినిమాలూ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే పరాజయం పాలయ్యాయని వీక్షకుల మాట. దాదాపు పక్షం రోజులుగా బాయ్‌కాట్ పదం కనుమరుగైంది. ఉద్దేశం ఏంటో తెలియదు కానీ, ‘బాయ్‌కాట్ ట్రెండ్ మంచిదే’ అంటూ ‘ద కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కామెంట్ చేయడం గమనార్హం.