అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. అందమైన జ్ఞాపకాలు. నిక్కరులో నాన్న, కోర మీసాలతో తాతయ్య, లంగా ఓణీలో అమ్మ, సావిత్రినో జముననో తలపించే అమ్మమ్మ.. ప్రతి ఛాయాచిత్రం అమూల్యమైందే. కానీ, కాల ప్రవాహంలో ఆ దర్పం కొట్టుకు పోతుంది. నలుపు-తెలుపు ఛాయాచిత్రాల మీద ఏవో మరకలు పడతాయి. లేదంటే, చెదలు దాడి చేస్తాయి. అది చూసి మన మనసులు కలత చెందుతాయి. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు. నేటి టెక్నాలజీతో వాటిని కాపాడుకోవచ్చు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త రంగులు అద్దుకోవచ్చు. ‘జెనరేటివ్ ఫేషియల్ ప్రీయర్ – జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్’ (జీఎఫ్పీ-జీఏఎన్) అని పిలిచే కృత్రిమ మేధ ఇందుకు సహకరిస్తుంది. ఈ సాంకేతికత పాత ఫొటోలకు తిరిగి ప్రాణంపోస్తుంది. ఎంతోకొంత స్పష్టంగా కనిపించే భాగాలను ఆధారం చేసుకుని.. చెరిగిపోయిన చోట అతుకులు సృష్టించగలదు కూడా. ఈ ఆవిష్కరణకు అవార్డు కూడా వచ్చింది. app.baseten.coలో చిరిగిన ఫొటోలను అప్లోడ్ చేసి, తాజా కాపీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.