న్యూఢిల్లీ: బీహార్ ఫలితాల నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీకి బీజేపీ చురకలు అంటించింది. ఆయన నిలకడైన ఎన్నికల ఓటములకు సంకేతంగా మారారని ఎద్దేవా చేసింది. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ రాహుల్పై విరుచుకుపడుతూ… ‘రాహుల్ గాంధీ! మరో ఎన్నికలు, మరో ఓటమి!
ఎన్నికల్లో నిలకడకు(ఓడిపోవడం గురించి) సంబంధించి ఏవైనా పురస్కారాలుంటే అవన్నీ ఆయన పొందేవారు. తమను అంత విశ్వసనీయంగా ఎలా కనుగొంటాడో అని ఎదురు దెబ్బలు కూడా ఆశ్చర్యపోతూ ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ…‘రాహుల్ గాంధీ నెం.1 వివాద రహిత, సవాల్ లేని, అపజయం లేని నాయకుడు. 95 ఎన్నికల్లో ఓటమి.. అవింకా కొనసాగుతున్నాయి.’ అని అన్నారు.