గంగవ్వ..ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 4తో తెలియని వాళ్లకు కూడా అందరికీ పరిచయం అయిపోయింది ఈ అవ్వ. అంతకుముందు యూ ట్యూబ్ లో మై విలేజ్ షోతో బాగా పాపులర్ అయ్యింది ఈమె. ఆ తర్వాత బిగ్ బాస్ షో అవకాశం వచ్చింది. 60 ఏళ్ళ వయసులో ఈమెకు వచ్చిన ఆఫర్ చూసి అంతా షాక్ అయ్యారు. ఆ వయసులో బిగ్ బాస్ కు వెళ్లి గంగవ్వ ఏం చేస్తుంది.. ఎందుకు సెలెక్ట్ చేసారబ్బా అంటూ అంతా విమర్శించారు. అక్కడున్న పరిస్థితులకు ఈమె ఎప్పుడు అలవాటు పడుతుంది..అక్కడ ఫిజికల్ టాస్కులు ఎలా చేస్తుందంటూ ప్రశ్నించారు.
ఎవరెన్ని చెప్పినా గంగవ్వ మాత్రం చాలా నమ్మకంగా కనిపించారు. తాను టైటిల్ గెలిచి వస్తానని చెప్పింది. ఉన్నన్ని రోజులు హాయిగా ఉంటానని చెప్పింది గంగవ్వ. అయితే మధ్యలో అనారోగ్యం పాలై బయటికి వచ్చేసింది పాపం. తాను ఇంట్లోకి వెళ్లడానికి కారణం మాత్రం సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసమే అని చెప్పింది గంగవ్వ. అనుకున్నట్లుగానే ఇప్పుడు పూర్తి చేసుకుంటుంది. కల నెరవేర్చుకుంటుంది అవ్వ. దానికి బిగ్ బాస్ టీంతో పాటు నాగార్జున కూడా సాయం చేసాడు.
గంగవ్వ వచ్చిన కారణం సరైంది కావడంతో అక్కడ వచ్చిన డబ్బులే కాకుండా మరిన్ని కూడా జోడించి ఇచ్చాడు నాగార్జున. బిగ్ బాస్ నుంచి అవ్వకు దాదాపు 5 లక్షలకు పైగానే వచ్చాయి. దాంతో పాటు నాగార్జున 7 లక్షలు ఇచ్చాడు.. ఇక బిగ్ బాస్ కూడా ప్రత్యేకంగా 10 లక్షలు ఇచ్చాడు. అలా 20 లక్షలకు పైగానే పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది గంగవ్వ. దీనికి నిర్మాణం కూడా పూర్తైపోయింది. తన ఇంట్లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు గంగవ్వ టీం.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె హాస్పిటల్ పాలు కావడం అభిమానులను కంగారు పెడుతుంది. అయితే పెద్ద అనారోగ్య సమస్యలేం లేవు. వయసు రీత్యా వచ్చే సమస్యలతోనే ఈమె ఆస్పత్రి మెట్లు ఎక్కింది. అసలేం జరిగిందంటే.. చాలా రోజుల నుంచి కూడా గంగవ్వకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. బిగ్ బాస్ కు కూడా ఈ సమస్యతోనే వచ్చింది గంగవ్వ. వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇబ్బంది పడింది. ఇప్పుడు దాని గురించే హాస్పిటల్ కు వెళ్లింది గంగవ్వ. అక్కడ మోకాళ్లకు చికిత్స చేయించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.