ములుగు, నమస్తేతెలంగాణ/భూపాలపల్లి రూరల్, నవంబర్ 1: రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్‌సింగ్ అన్నారు. శనివారం ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నిర్మించే నూతన కోర్టు భవనాలకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు ఈవీ వేణుగోపాల్, ఎన్. రాజేశ్వర్‌రావు హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేశ్కుమార్సింగ్ మాట్లాడుతూ వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్థకు ఉందన్నారు.
కొత్త కోర్టుల ఏర్పాటు అనేది సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణే న్యాయ వ్యవస్థ ధ్యేయం కావాలన్నారు. ములుగులో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ పాల్గొన్నారు. భూపాలపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పాల్గొన్నారు.
వెంకటాపూర్ : యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు వేణుగోపాల్, రాజేశ్వర్‌రావు సందర్శించారు. అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా రుద్రేశ్వరస్వామికి పూజలు చేశారు. అర్చుకులు ఆలయంలో వారిని సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ శిల్ప సంపదను వారికి వివరించారు. అలాగే ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సైతం న్యాయమూర్తులు సందర్శించారు.