వనపర్తి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యావంతులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలున్నవారు మోసగాళ్ల వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగడంతో కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారు. మోసాలకు పాల్పడుతూ సామాన్యులను దోచుకుంటున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా సైబర్‌క్రైం కొనసాగిస్తున్నారు. వారి బారిన పడిన వారిలో కొంతమంది పరువుపోతుందనే భయంతో తనువు చాలిస్తున్నారు. సైబర్‌క్రైం మోసాలపై వనపర్తి పోలీసులు అవగాహన చేపడుతున్నారు.
లోన్ యాప్ వేధింపులు..
లోన్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసిన సమయంలో మొబైల్లోని నం బర్లు, ఫొటోలు వంటి వ్యక్తిగత వివరాలను యాప్ నిర్వాహకులు మన అనుమతి లేకుండానే తీసుకుంటున్నారు. లోన్ తీసుకునే సమయంలో వారి షరతులకు అంగీకారం తెలపక తప్పదు. ఒక్కసారి లోన్ తీసుకుంటే ఇక వేధింపులు తప్పవు. తీసుకున్న లోన్కంటే ఎక్కువ డబ్బులు కట్టమని వేధించడం మొదలు పెడతారు. అప్పు తీర్చకపోతే కుటుంబంలోని మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు పంపుతామని బెదిరింపులకు దిగుతారు. వీటిని భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో లోన్‌యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దు.
అందమైన అమ్మాయిలతో ఎర
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలతో కూడిన అకౌంట్ల నుంచి వచ్చిన ప్రెండ్షిప్ రిక్వెస్ట్‌లను ఓకే చేయొద్దు. యాక్సెప్ట్ చేయగానే మిమ్మల్ని వాట్సాప్ లేదా టెలీగ్రాంకు ఆహ్వానిస్తారు. చాటింగ్ లేదా వీడియో కాల్స్ చేసి ప్రేరేపిస్తారు. వీడియో కాల్లో ఒక అమ్మాయి న్యూడ్‌గా ఉండి మిమ్మల్ని న్యూడ్‌గా మారమంటుంది. ఈ దృశ్యాలను వీడియో రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ ఇవ్వకుంటే సామాజిక
మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తారు.
ఇన్వెస్ట్మెంట్ మోసాలు..
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో నటరాజ్ పెన్సిల్ లోడ్, వర్క్‌ఫ్రం హోం వంటి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంటుంది. ‘ఇంటి వద్ద నుంచి పనిచేస్తే రూ.30 వేలు ఇస్తాం. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్ అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వాట్సాప్‌లో చాట్‌చేసి మీ పూర్తి వివరాలు అడుగుతాడు. ఆ తర్వాత జాబ్ ఐడీ కార్డు తయారు చేయాలి డబ్బులు పంపించమంటారు. డబ్బులు చెల్లించిన తరువాత నటరాజ్ పెన్సిల్ లోడ్ పంపించాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని మరింత డబ్బు లాగుతారు. పెన్సిల్ లోడ్ మీకు అందగానే డబ్బులు ఇస్తామని చెబుతారు. డబ్బులు చెల్లించారో ఇక అంతే సంగతులు.. డబ్బులు పోతాయి. పెన్సిల్ లోడ్ రాదు. వారిని సంప్రదించాలని ప్రయత్నిస్తే స్పందన ఉండదు. ఆ న్‌లైన్ ప్రకటనదారులను సంప్రదిస్తే నమ్మించే ప్రయత్నాలు చేస్తారు. నోయి డా, ముంబై వంటి ప్రాంతాల్లో ఆఫీస్ అడ్రసులు ఉంటాయి. నటరాజ్ పెన్సిల్ యాడ్ కనిపిస్తే అస్సలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తగా ఉండడమే రక్ష..
లోన్ యాప్స్, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు. లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసినా.. మన నుంచి ఎటువంటి పర్మీషన్స్ ఇవ్వకూడదు. లోన్ తీసుకొని వేధింపులకు గురైతే 1903 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు వివరాలు తెలపండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మిమ్మల్ని వేధిస్తున్న వారి నుంచి కాపాడుతాం. ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు నమ్మి స్పందించకండి. డబ్బులు ముందుగా బదిలీ చేయమంటే అది మోసమే. ఆకర్షణీయమైన ప్రకటనలు, మాటలతో తెలివిగా బురిడీ కొట్టిస్తారు. వారి లక్ష్యం కేవలం అక్రమంగా డబ్బు సంపాదించడమే. అందమైన అమ్మాయిలతో కూడిన అకౌంట్లతో వచ్చిన రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకండి. డబ్బులు మోసపోయాక చాలా మంది బాధితులు వస్తున్నారు. ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది.
– అపూర్వరావు, ఎస్పీ, వనపర్తి