– బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్
నల్లగొండ, డిసెంబర్ 02 : ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖలో బీసీ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 30 ఏళ్లు పని చేసినా బీసీ ఉద్యోగులు ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. మండల్ కమిషన్, పార్లమెంట్ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫారసు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి చట్ట పరమైన, రాజ్యాంగ పరమైన, న్యాయ పరమైన అడ్డంకులు అవరోధాలు లేవన్నారు. బీసీల ఎదుగుదలకు క్రిమిలేయర్ గొడ్డలిపెట్టు అన్నారు. బీసీలకు క్రిమిలేయర్ ఎత్తివేయాలన్నారు. త్వరలో అన్ని శాఖల్లో సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. ప్రతి బీసీ ఉద్యోగి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా మహా సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు వాడపల్లి సాయిబాబా, నల్ల సోమ మల్లయ్య, బీసీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ లక్ష్మీ, నవీన్, వేణు, నరేశ్, సత్యనారాయణ, ప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.