తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సర్కారు కానుకగా ఏటా చీరలు పంపిణీ చేస్తున్నది. 18ఏండ్లు నిండిన ప్రతీ అతివకు చీరె అందించనుండగా, ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో 3,84,234మంది మహిళలు ఉండగా, వారి కోసం చీరెలు తెప్పించారు. ఇప్పటికే జిల్లాకు లక్షా 97వేల చీరెలు జిల్లాకు చేరుకోగా, హుస్నాబాద్ నాబార్డు గోదాంలో భద్రపర్చారు. అక్కడి నుంచి నాలుగైదు రోజుల్లో మండల కేంద్రాలకు చేర్చుతారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 12 : తెలంగాణ ఆడబిడ్డల అపురూప పండుగ బతుకమ్మపండుగ. ఆడబిడ్డలందరూ కొత్త చీరెలు ధరించాలని సీఎం కేసీఆర్ ఏటా పండుగ కానుకగా బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారు. ఈసారి బతుకమ్మ పండుగకు చీరెలు జిల్లాకు చేరుకున్నా యి. ఇప్పటి వరకు జిల్లాకు 1.97లక్షల చీరెలు వచ్చాయి. మిగతా చీరెలు మరో వారం రోజుల్లో రానున్నాయి. తీరొక్క రంగుల్లో తయారు చేయించిన బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరుకున్న వైనంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
పంపిణీకి చీరెలు సిద్ధం
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగైన బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరెలు పంపిణీకి సిద్ధమయ్యాయి. జిల్లాలో 18 ఏండ్లు నిండిన మహిళలు 3,84,234 మంది ఉండగా ఇప్పటి వరకు జిల్లాకు లక్షా 90వేల చీరెలు వచ్చా యి. మిగతా చీరెలు మరో వారం రోజుల్లో రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా చీరెల పంపిణీకి సిద్ధం చేశారు. జిల్లాకు సిరి సిల్ల్ల నుంచి 90శాతానికిపైగా చీరెలు రాగా, మరో 10శాతం చీరెలు చొప్పదండి నుంచి రానున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 30రకాల రంగులు 289కలర్ ప్యాటర్న్‌తో 30 రకాల వైరటీలతో చీరెలను తయారు చేయించింది. ఈ చీరెలను పూర్తిగా నేతన్నలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మర మగ్గాలపై తయారు చేయించిన పాలిస్టర్ క్లాత్‌తో జెరీ బార్డర్‌తో చీరెలు తీరొక్క రంగుల్లో వివిధ డిజైన్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎంగిల పూల బతుకమ్మ పండుగ నాటికి వీటిని ఆడబిడ్డలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాలో 3,84, 234 చీరెలు కావాల్సి ఉండగా అందులో ఇప్పటి వరకు లక్షా97వేల చీరెలు హుస్నాబాద్‌లోని నాబార్డు గోదామ్‌లో నిల్వ చేశారు. మరో 4-5 రోజుల్లో చీరెలను మండల కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి ఈ నెల 20 వరకు చీరరెలను గ్రామాల్లోని రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వ ఆదేశాలకు ఆనుగుణంగా మహిళలకు పంపిణీ చేయనున్నారు.