ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లెపల్లెనా ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు. చిన్నారులు పటాకులను కాల్చి సందడి చేశారు. అంతేకాకుండా కొంగరకలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో డీఆర్డీవో, మహిళా సంక్షేమ శాఖ, మున్సిపాలిటీ, వ్యవసాయ శాఖ, మెప్మాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాలు నేత్రపర్వంగా సాగాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో మహిళా అధికారులు, అంగన్వాడీ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, ఒకరికొకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. గౌరమ్మలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ విద్యుద్దీపాల వెలుగుల్లో అంతా ఒక్కచోటకు చేరి ఆడడంతో పూలజాతరను తలపించింది. లయబద్ధంగా సాగే పాటలు, చప్పట్లతో ఊరూవాడ మార్మోగగా.. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలతో పండుగ శోభ ఉట్టిపడింది. అనంతరం ఒకరికొకరు వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. స్థానిక చెరువులు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ
వికారాబాద్ కలెక్టర్ నిఖిల
పరిగి, సెప్టెంబర్ 26 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండుగ అని వికారాబాద్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను మహిళలు పెద్దఎత్తున పాల్గొని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సోమవారం డీఆర్డీవో, మహిళా సంక్షేమ శాఖ, మున్సిపాలిటీ, జిల్లా వ్యవసాయ శాఖ, మెప్మాల సంయుక్త ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సంబురాల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 3 వరకు నిర్వహించే ఉత్సవాల్లో మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా అధికారిణులు, మహిళా సంఘాల సభ్యులు బతుకమ్మ ఆడారు. వేడుకల్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితాకుమారి, డీఆర్‌డీవొ కృష్ణన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ, మహిళా సంఘాల సభ్యులున్నారు.
పూలను పూజించే పండుగ ఒక్క తెలంగాణలోనే..
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్
రంగారెడ్డి, సెప్టెంబర్ 26, (నమస్తే తెలంగాణ) : మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగ బతుకమ్మ అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ పాల్గొని పూజలు చేసి, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పూలను పూజించే సంస్కృతి, సంప్రదాయాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నదని పేర్కొన్నారు. వేడుకల్లో డీఆర్డీవో ప్రభాకర్, ఏవో ప్రమీల, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.