తెలంగాణ సారవంతమైన సంస్కృతి, ప్రకృతి జీవన సౌందర్యానికి నెలవు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ చిహ్నం బతుకమ్మ. తెలంగాణ సంప్రదాయాన్ని బతుకమ్మ ప్రపంచ నలుదిశలా ఎలుగెత్తి చాటుతున్నది. ప్రపంచప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతంతో బతుకమ్మ పాటై ప్రవహించింది.
దేశ దేశాల్లో బతుకమ్మ ఘనకీర్తిని చాటింది. అన్నింటిలో తలమానికంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన, దుబాయిలోని బుర్జ్ ఖలీఫా భవనం వేదికగా మన బతుకమ్మ ప్రదర్శనతో విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి విశిష్ఠతను చాటింది. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుర్జ్ ఖలీఫా భవనంలో బతుకమ్మకు దక్కే గౌరవాన్ని వీక్షించేందుకు జాగృతి బృందంతో దుబాయి చేరుకోవటం హర్షణీయం.
రాష్ట్రసాధన ఉద్యమ కాలంనుంచే తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి మనదైన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పూనుకోవటం ముదావహం. పరాయి పాలనలో వివక్షకు గురైన బతుకమ్మ పండుగను తాను భుజాన వేసుకొని బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా కృషిచేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో బతుకమ్మను గౌరవించి జరుపుకునేలా ప్రోత్సహించారు. ఒక రకంగా బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవితకే దక్కింది. విదేశాల్లో ప్రవాస తెలంగాణీయులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనంతటి వెనుక ‘తెలంగాణ జాగృతి’ సంస్థ అధ్యక్షురాలు కవిత కృషి ఎనలేనిది.
2009లో కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నప్పుడు కవిత ఉద్యమకారులకు మద్దతుగా నిలబడ్డారు. రాష్ట్రసాధన కోసం పోరాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న అప్పటి పాలకుల దుర్మార్గాన్ని ఎండగడుతూ అండగా నిలిచారు. రాష్ట్ర అవతరణ తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం తన వాణిని వినిపిస్తూ, సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల వాటాల కోసం పోరాడారు. పార్లమెంటులో కవిత ప్రసంగాలు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన సీనియర్ ఎంపీలను సైతం ఆకట్టుకుని గొప్ప వక్తగా కీర్తి పొందారు. ఆ క్రమంలోనే.. కవితను తెలంగాణ బతుకమ్మ అని పిలిచేవారంటే.. ఆమె ప్రసంగాల ప్రభావం ఊహించవచ్చు.
ఉద్యమకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపేందుకు, సంస్కృతి సంప్రదాయాలను విస్తరింపజేసేందుకు కవిత తన వంతు కృషిచేశారు. ఇందులో భాగంగానే అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లి తెలంగాణ సంస్కృతి వ్యాప్తికి కృషిచేశారు. బతుకమ్మను భవిష్యత్తరాలు మరిచిపోకుండా ఉండాలని, బతుకమ్మను అంగరంగ వైభవంగా జరిపించాలనే సంకల్పించుకున్నారు. విదేశాల్లో ఉన్న మనవాళ్లకు మన సంప్రదాయాలపై సన్నగిల్లుతున్న ఆదరణ, గౌరవాల పట్ల ఆందోళనచెంది తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం కోసం పూనుకున్నారు. ఈ నేపథ్యంలోంచే తాను ప్రపంచమంతా తిరుగుతూ.. బతుకమ్మను ఘనంగా జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమ సమయంలో జాగృతి ద్వారా బతుకమ్మ తెలంగాణ అంతటా నిర్వహించి మహిళలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిత పాత్ర, జాగృతి వేదిక చేసిన కృషి ఎనలేనిది.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పడానికి కవిత ప్రణాళికా బద్ధంగా ముందుకు పోతున్నారు. మొదట తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే అమెరికా వెళ్లి అక్కడ ప్రపంచమంతా గర్వించేలా ఘనంగా బతుకమ్మ నిర్వహించారు. అదేవిధంగా లండన్లో అశేష జనాదరణను చూరగొన్నారు. 2015, 16లో తెలంగాణలో జాగృతి అధ్వర్యంలో మొదట తెలంగాణలోనే ఘనంగా జరిపించారు. ఆ తర్వాత 2016లో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయి, మలేషియా, న్యూజిలాండ్, డెన్మార్క్ దేశాలను సందర్శించి తెలంగాణ సంస్కృతిని చాటారు. అమెరికా, యూరప్ దేశాల్లో జాగృతి శాఖలను ఏర్పర్చి అక్కడ ఉన్న తెలంగాణ వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేలా దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలోనే కాకుండా, విదేశాల్లో బతుకమ్మ పండగను అధికారికంగా (ప్రభుత్వ సహాయం) నిర్వహించే స్థాయికి తీసుకొచ్చిన ఘనత మన ఆడబిడ్డ కవితకు దక్కుతుంది. అలాగే ఈ రోజు ప్రపంచం మొత్తం బతుకమ్మను సగౌరవంగా జరుపుకోవడానికి కవిత కృషి కారణమనటంలో అతిశయోక్తి లేదు.
(వ్యాసకర్త: ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు)
కాసర్ల నాగేందర్ రెడ్డి
+61478311563