హరారె: క్రికెట్ జెంటిల్మెన్ గేమే అయినా.. అప్పుడప్పుడూ ప్లేయర్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తస్కిన్ అహ్మద్ పిచ్‌పైనే ఓ డ్యాన్స్ స్టెప్ వేయడం జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానికి నచ్చలేదు. అతడు వేసిన బాల్‌ను వికెట్ కీపర్‌కు వదిలేసిన తస్కిన్.. ఆ వెంటనే ఓ డ్యాన్స్ స్టెప్ వేశాడు. ఇది చూసిన ముజరబాని అతనిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఇద్దరు ప్లేయర్స్ ఒకరి ముఖంలో మరొకరు కోపంగా చూసుకుంటూ మాటామాటా అనుకున్నారు.
జింబాబ్వే బౌలర్ ముజరబాని అలా రియాక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను ఒక దశలో 132 పరుగులకే 6 వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టింది జింబాబ్వే. అయితే లిటన్ దాస్ (95), మహ్మదుల్లా (150), చివర్లో తస్కిన్ అహ్మద్ (75) అద్భుతంగా రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా 9వ వికెట్‌కు మహ్మదుల్లాతో కలిసి తస్కిన్ 191 పరుగులు జోడించడం విశేషం.