బంతి కాళ్ల ముందు పడిందంటే చాలు.. కండ్లు మూసి తెరిచేలోగా.. ఫ్లిక్ షాట్‌తో బౌండ్రీ దాటించడం అతడి ైస్టెల్ఆఫ్స్టంప్ ఆవల బంతి వేస్తే.. బౌలర్ చేతి నుంచి వచ్చినంత వేగంగా కట్ షాట్‌తో గీత దాటించడం అతడి ట్రేడ్మార్క్వేగం తగ్గించి బోల్తా కొట్టిద్దామనే లోపే.. అంతే చాకచక్యంగా శరీరాన్ని విల్లులా వంచుతూ కీపర్ తల మీదుగా స్కూప్ షాట్‌తో సిక్సర్ బాదడం అతడి స్పెషాలిటీ
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం ;హుక్, పుల్, డ్రైవ్, కవర్‌డ్రైవ్, ఆఫ్‌డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్.. ఇలా క్రికెట్ పుస్తకాల్లో ఉన్న షాట్లన్నీంటిని అవపోసాన పట్టిన మహామేధావి అతడు. లెగ్‌సైడ్, ఆఫ్‌సైడ్ అనే తేడా లేకుండా.. వికెట్‌కు నలువైపులా బౌండ్రీలు కొట్టగల సామర్థ్యం అతడి సొంతం. ఈ ఏడాది టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక స్ట్రయిక్‌రేట్ ఇలా ఏ విషయంలో చూసుకున్నా.. అతడి దరిదాపుల్లో మరో ఆటగాడు లేడంటేనే అతడి ఆట ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. జట్టులోకి వచ్చి సరిగ్గా ఏడాది కూడా కాకముందే.. ప్రధాన ఆటగాడిగా ఎదిగిన అతడే సూర్యకుమార్ యాదవ్. పొట్టి ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ట్రంప్‌కార్డ్ అని భావిస్తున్న సూర్య ఆటతీరుపై ప్రత్యేక కథనం..
రెండేండ్ల క్రితం యూఏఈ వేదికగా బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సూర్య కనబర్చిన తెగువ అతడిని ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. అంతకుముందు ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడినా రాని గుర్తింపు.. విరాట్ కోహ్లీతో ‘సై అంటే సై’అనడంతో దక్కింది. అప్పటికే బెంగళూరు చేతిలో ఓసారి ఓటమి పాలై ఉన్న ముంబై ఇండియన్స్ జట్టును కీలక పోరులో సూర్య గట్టెక్కించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు భారీ స్కోరు చేయగా.. ఛేదనలో తక్కినవాళ్లంతా విఫలమైన చోట సూర్యకుమార్ తన దమ్ముచూపాడు. ఎడాపెడా బౌండ్రీలతో అబుదాబి స్టేడియాన్ని హోరెత్తించిన సూర్య.. మ్యాచ్ చివర్లో డగౌట్ వైపు ‘నేనున్నానుగా చూసుకుంటా’అన్నట్లు చూసిన చూపు ఏ క్రికెట్ అభిమాని అంత త్వరగా మరిచిపోలేడు. ఎదురుగా ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లీ ఉసిగొల్పుతున్నా.. ఏమాత్రం సంయమనం కోల్పోని అతడి గుండె ధైర్యం ప్రతి ఒక్కరినీ కట్టి పడేసింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే భారత జాతీయ జట్టుకు ఎంపికైన సూర్యకుమార్.. రెండేండ్లు తిరిగేలోపే అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో అదే విరాట్ కోహ్లీతో హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు.
సార్థక నామధేయుడు..
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు మొత్తం పలకలేని కొందరు కామెంటేటర్లు అతడికి ముద్దుగా ‘స్కై’అని పేరుపెట్టగా.. అందుకు తగ్గట్లే ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సార్థక నామధేయుడు అనిపించుకున్నాడు. ఇటీవల ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతడి జోరు మరో లెవల్లో కనిపించింది. ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నా.. అభిమానుల దృష్టి తన వైపు తిప్పుకుంటూ.. 5 ఫోర్లు, 5 సిక్సర్లతో ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అతడి విధ్వంసం పతాక స్థాయికి చేరిందనే చెప్పొచ్చు. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో అతడు కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు.
ఇదే కోరుకునేది!
నిరుడు జరిగిన ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు చేరకుండానే ఇంటి బాట పట్టిన టీమ్ఇండియా ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లే గత కొన్ని నెలలుగా టీమ్ఇండియా బ్యాటింగ్ విధానంలో పలు మార్పులు సంభవించాయి. క్రీజులో నిలదొక్కుకోవడం, వికెట్ కాపాడుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టకుండా.. ఆరంభం నుంచి విరుచుకుపడటమే పరమావధిగా మనవాళ్లు మైదానంలో అడుగుపెడుతున్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నది మాత్రం సూర్యకుమారే. టాపార్డర్ విఫలమైతే ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలబడి జట్టుకు మంచి స్కోరు అందించడంతో పాటు.. టాప్-3 శుభారంభాన్నిస్తే దాన్ని మరో స్థాయికి చేర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఒక్కసారి క్రీజులో అడుగుపెడితే.. బౌలర్ బుర్రను ముందే చదివేసినట్లు.. బంతి ఎక్కడ పడుతుందో తనకు తెలిసినట్లు అవలీలగా బౌండ్రీలు బాదుతున్న సూర్యకుమార్.. అభినవ డివిలియర్స్ అనిపించుకుంటున్నాడు. ‘మిస్టర్ 360’ను మరిపిస్తూ చెలరేగిపోతున్న సూర్యకుమార్ అనతి కాలంలోనే ‘360 డిగ్రీస్ ప్లేయర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు.