తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు ఆలయం వద్ద గల వాహన మండపంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇవాళ ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములను, చక్రత్తాళ్వార్‌ను ఆలయం వద్ద గల వాహన మండపంలోనికి వేంచేపు చేశారు. అనంతరం సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో అభిషేకం చేశారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ గంగాళంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. కాగా రాత్రి 8.30 నుండి 9.౩౦ గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.