Tim cook | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ హయాంలో సంస్థ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్ల డాలర్ల పై మాటే. ఆపిల్ ఎం-క్యాప్ ప్రపంచ దేశాల జీడీపీలో 97 శాతం ఉండొచ్చునని అంచనా. టిమ్ కుక్ సారధ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఈ ఏడాది 12 శాతం వ్రుద్ధితోపాటు ఆపిల్ షేర్లు 1100 శాతం పెరిగాయి.
1990వ దశకం చివర్లో ఆపిల్‌లో కెరీర్ ప్రారంభించిన టిమ్ కుక్.. నాటి సీఈవో.. ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ తర్వాత స్థానానికి ఎదిగారు. 2011 ఆగస్టులో స్టీవ్ జాబ్స్ అకస్మిక మరణం తర్వాత ఆపిల్ సీఈవోగా టిమ్‌కుక్ బాధ్యతలు స్వీకరించారు. ఐ-ఫోన్లు, టెక్ గాడ్జెట్స్ తయారీలో అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఆపిల్‌కు సీఈవోగా వ్యవహరించారు.
తన పనితీరుతో సంస్థ పురోభివ్రుద్ధిలో కీలకంగా వ్యవహరించారు టిమ్ కుక్. అందుకు ఆయనను ఆపిల్ బిలియనీర్‌గా తీర్చిదిద్దింది. ఆయన నికర ఆస్తి 1.5 బిలియన్ల డాలర్లు. 2011లో ఆపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆయన శక్తి సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. స్టీవ్ జాబ్స్ ఆకాంక్షలను నెరవేరుస్తారా? అన్న అనుమానాలు వచ్చాయి. అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ ఆపిల్ రెవెన్యూను రెట్టింపు చేశారు.
టిమ్ కుక్ తన 10 ఏండ్ల ప్రస్థానంలో బీట్స్, ఇంటెల్ మోడెం యూనిట్ ఆపిల్ టేకోవర్ చేసుకున్నది. కొత్తగా ఆపిల్ వాచ్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఐ-పాడ్స్, ఐ-ఫోన్స్ మాదిరే ఎయిర్ ప్యాడ్స్‌ను ఆవిష్కరించారు.
2011లో పదేండ్ల కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు టిమ్ కుక్.. తాజాగా చివరి వేతన చెల్లింపులు అందుకున్నారు. 2011లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన టిమ్ కుక్కు చివరి, 10వ వేతనంగా సుమారు రూ.5,529 కోట్ల (750 మిలియన్ డాలర్లు) విలువైన 50 లక్షల సంస్థ షేర్లను కేటాయించింది ఆపిల్. గత మూడేండ్లుగా ఆపిల్ పురోగతిలో ఆయన నిష్కళంకమైన పనితీరుకు గుర్తింపుగా టిమ్ కుక్ ఈ వేతనాన్ని అందుకున్నారు.