e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఎంఎంటీఎస్‌ రెండో దశలో మరో కీలక అడుగు

ఎంఎంటీఎస్‌ రెండో దశలో మరో కీలక అడుగు

ఎంఎంటీఎస్‌ రెండో దశలో మరో కీలక అడుగు
 • రెండోదశలో కీలక అడుగు
 • సికింద్రాబాద్‌తో శంషాబాద్‌ అనుసంధానం
 • ఫలక్‌నుమా-ఉందానగర్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ పూర్తి
 • అందుబాటులోకి 13.98 కిలోమీటర్ల మార్గం
 • మరింత మెరుగుకానున్న సబర్బన్‌, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిర్వహణ

నగరవాసులు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్‌ రెండో దశలో మరో కీలక అడుగు పడింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రాంతమైన శంషాబాద్‌ను సికింద్రాబాద్‌తో అనుసంధానించే ఫలక్‌నుమా-ఉందానగర్‌ రూట్‌ సిద్ధమైంది. 13.98 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ మార్గంలో డబుల్‌ రైల్వే లైను, విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో ‘ఎంఎంటీఎస్‌’ కూతకు మార్గం సుగమమైంది. శనివారం రైల్వే అధికారులు పరిశీలించి..ట్రయల్‌ రన్‌ సైతం నిర్వహించారు. ప్రధానమైన ఈ లైను అందుబాటులోకి రావడంతో సబర్బన్‌, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిర్వహణ మరింత మెరుగుకానున్నదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు స్పష్టం చేశారు.

మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసు (ఎంఎంటీఎస్‌) రెండో దశలో కీలక అడుగు పడింది. గ్రేటర్‌ దక్షిణ భాగాన ఉన్న ప్రధానమైన ప్రాంతమైన శంషాబాద్‌ను అనుసంధానించే ఫలక్‌నుమా-ఉందానగర్‌ మార్గంలో ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. 13.98 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ మార్గంలో డబుల్‌ రైల్వే లైనుతో పాటు విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా రూపొందించిన ఫలక్‌నుమా-ఉందానగర్‌ మార్గం అందుబాటులోకి వచ్చినట్లుగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శనివారం ప్రకటించారు.

ప్రధానంగా ఈ మార్గం అందుబాటులోకి రావడంతో అన్నిరకాల రైళ్ల నిర్వహణ సులభతరం కానుందని తద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు స్పష్టం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎంఎంటీఎస్‌ రైలు సౌకర్యం అనేది చాలా కీలకమైనది. ముఖ్యంగా సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు తక్కువ సమయంలో అతి తక్కువ టికెట్‌ ఖర్చుతో గమ్యస్థానాలు చేరుతున్నారు. ఈ క్రమంలో మొదటి దశ ఎంఎంటీఎస్‌లో భాగంగా ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలోనే రోజుకు దాదాపు లక్ష 20వేల మంది వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మొదటి దశ ఎంఎంటీఎస్‌ 42 కిలోమీటర్ల మేర అందించే సేవలకు మంచి డిమాండు ఉన్నందున రెండో దశ కూడా చేపట్టారు.

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు గత నాలుగైదు సంవత్సరాలుగా ఊపందుకున్నాయి. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) 84 కిలోమీటర్ల మేర ఆరు మార్గాల్లో రెండో దశ పనులను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పటాన్‌చెరు-తెల్లాపూర్‌ తొమ్మిది కిలోమీటర్ల మార్గం గతంలోనే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన మార్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా మరో మార్గం అందుబాటులోకి వచ్చింది.

రెండో దశలో భాగంగా చేపట్టిన ఫలక్‌నుమా-ఉందానగర్‌ (శంషాబాద్‌) మార్గంలో విద్యుదీకరణతో పాటు డబ్లింగ్‌ పనులు కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చినట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. 13.98 కిలోమీటర్ల పొడవున ట్రాక్‌ (రైల్వే మార్గం) డబ్లింగ్‌ చేయడం, విద్యుదీకరించడంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కూడా పూర్తయినట్లు స్పష్టం చేశారు. కర్నూల్‌ నగరం, గుంతకల్‌, బెంగళూరు, దక్షిణం వైపునకు సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లకు అనుసంధానంలో ఈ రైల్వే లైను అత్యంత కీలకమైనది.

ఏపీ, కర్ణాటక సంపర్క్‌ క్రాంతి రైళ్లతో సహా అనేక ప్రయాణికుల రైళ్ల సర్వీసులు ఈ మార్గం ద్వారానే నడుస్తాయి. విద్యుదీకరణతో పాటు డబుల్‌ లైన్‌ నిర్మాణ పనులు పూర్తయినందున రద్దీ నివారణకు దోహదపడతాయి. అన్నిరకాల రైళ్ల (సబర్బన్‌, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌) నిర్వహణ సామర్థ్యం కూడా ఇంకా మెరుగవుతుంది. అంతేగాకుండా మరిన్ని సరుకు రవాణా రైళ్ల నిర్వహణకు కూడా ఉపయోగపడుతుంది.

ఫలక్‌నుమా-ఉందానగర్‌ మార్గంలో…ఫలక్‌నుమా, ఎన్‌పీఏ శివరాంపల్లి, బుద్వేల్‌, ఉందానగర్‌… ఇలా నాలుగు స్టేషన్లలో నూతన స్టేషన్‌ భవనాలు నిర్మించనున్నారు. దీంతో పాటు హైలెవల్‌ ప్లాట్‌ఫారాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, వైడ్‌ సర్క్యులేటింగ్‌ ఏరియా, పార్కింగు వసతులతో సహా ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో భారీ, చిన్న వంతెనల నిర్మాణమే కాకుండా ఆరు లెవల్‌ క్రాసింగ్‌ గేట్లలో ఒక ఆర్‌యూబీ నిర్మాణం, మిగిలిన చోట్ల సిగ్నల్‌ ఇంటర్‌ లాకింగ్‌ ఏర్పాటు చేశారు. ఫలక్‌నుమా-ఉందానగర్‌ డబుల్‌ లైన్‌ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన అధికారులు, ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు.

 • పురోగతిలో మిగిలిన మార్గాల పనులు…
 • ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా గ్రేటర్‌ పశ్చిమంలో పటాన్‌చెరు-తెల్లాపూర్‌ (9 కిలోమీటర్లు), ఫలక్‌నుమా-ఉందానగర్‌ (13.98 కిలోమీటర్లు) అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన మార్గాల్లో పనులను పరిశీలిస్తే…
 • సికింద్రాబాద్‌-బొల్లారం మధ్య 19 కిలోమీటర్ల మార్గంలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి.
 • నగరానికి ఉత్తరం భాగాన సికింద్రాబాద్‌-బొల్లారం-మేడ్చల్‌ మధ్య 28 కిలోమీటర్ల మేర విద్యుదీకరణతో డబుల్‌ లైన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి.
 • రద్దీ నివారణకు, మరిన్ని రైళ్లను నడిపేందుకు ఘట్‌కేసర్‌-మౌలాలి మధ్య విద్యుదీకరణ, ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ పనులతో ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌ స్థానంలో నాలుగు వరుసల రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
 • మౌలాలి-మల్కాజిగిరి-సీతాఫల్‌మండి మధ్య పది కిలోమీటర్ల మేర డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు చివరి దశలో ఉన్నాయి.
 • సికింద్రాబాద్‌ స్టేషన్‌ దాటుతూ… తూర్పు-పశ్చిమాన్ని అనుసంధానం చేసేలా ఐదు నూతన స్టేషన్ల నిర్మాణంతో పాటు మౌలాలి-సనత్‌నగర్‌ మధ్య 21 కిలోమీటర్ల మేర విద్యుదీకరణతో పాటు డబ్లింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎంఎంటీఎస్‌ రెండో దశలో మరో కీలక అడుగు

ట్రెండింగ్‌

Advertisement