వర్షాల్లో రక్షణగా యానిమల్ వారియర్స్
చెట్ల మీద చిక్కుకున్నా, రోడ్లపై పడిపోయినా అండగా బృందాలు
వీధిజంతువుల అత్యవసర సేవల కోసం 9697887888
వసతి కల్పించేందుకు తాత్కాలిక గూడారాల ఏర్పాటు
వీధి జంతువుల రక్షణ కోసం జంతుప్రేమికులు
యానిమల్ వారియర్స్ పేరుతో హుటాహుటిన సేవలు
నగర శివారు అమీన్పూర్లో ఓ బర్రె రెండు రోజులుగా వర్షంలో తడిస్తూ రోడ్డు పైనే ఉండిపోయింది. చలికి అలాగే ఉండడంతో అనారోగ్యానికి గురైంది. సమాచారం అందుకున్న యానిమల్ వారియర్స్ టీమ్ స్థానిక పశువైద్యుల సహకారంతో దానికి చికిత్స చేసి ఓ గోశాలలో అప్పగించారు.
ఓ కోతి పిల్ల వర్షానికి చార్మినార్ వద్ద ఓ చెట్టును ఎక్కింది. ఆ పక్క కొమ్మలపై తల్లి కోతి ఉంది. పిల్ల కోతికి చెట్టుపై ఉన్న మాంజా ఇరుక్కుపోయి కేకలు పెట్టింది. స్థానికులు కాపాడే ప్రయత్నించినా మిగిలిన కోతులు దాడి చేయడంతో భయపడ్డారు. వెంటనే యానిమల్ వారియర్స్‌కు సమాచారం ఇవ్వడంతో వ్యవస్థాపకుడు ప్రదీప్ బృందం దాదాపు 24 గంటల పాటు కష్టపడి పిల్ల కోతి రక్షించారు.
సిటీబ్యూరో, జూలై 13(నమస్తే తెలంగాణ): రోజుల తరబడి వర్షానికి తడుస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న వీధి జంతువులను కాపాడేందుకు హైదరాబాద్‌కు చెందిన యానిమల్ వారియర్స్ టీం మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జంతు ప్రేమికులను ఒక దగ్గరకు చేర్చి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా అత్యవసరం ఉన్నప్పుడు జంతువులను కాపాడేందుకు యానిమల్ వారియర్స్ 9697887888 కంట్రోల్ నెంబర్‌ను సంప్రదించే విధంగా ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది జంతు ప్రేమికులను వీధి జంతువులను కాపాడేందుకు యానిమల్ వారియర్స్ టీం తీర్చిదిద్దింది.
జంతువులకు హైపోథెర్మియా
వర్షకాలంలో జంతువులు రోజుల పడి తడవడం, చలికి అలానే ఉండడంతో అవి హైపోథెర్మియాకు గురవుతాయని యానిమల్ వారియర్స్ టీం ప్రతినిధి ప్రదీప్ తెలిపారు. ఈ హైపోథెర్మియా కారణంగా జంతువుల్లో డీ-హైడ్రేషన్ అయి శరీరంలోని ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి అవి కార్డియాక్ అరెస్టుకు గురవుతాయని తెలిపారు. ఇలా జంతువులు వర్షకాలంలో అధికంగా చనిపోతాయని వివరించారు. ఈ నేపథ్యంలో యానిమల్ వారియర్స్ తరఫును వర్షకాలంలో వీధికుక్కలు, పిల్లులు, గేదెలు, పక్షులు ఇతర జంతువులను కాపాడేందుకు తమ వంతుగా చాలా చోట్ల టార్ఫాలిన్తో చిన్న చిన్న గూడారాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో వీధికుక్కలు, ఇతర వీధి జంతువులు తడవకుండా ఉంటాయన్నారు.
ఆ ఐదు గంటలు..
అమీర్‌పేటలో ‘ఆపరేషన్ డాగ్’
అమీర్‌పేట్, జూలై 13: నాలుగు అంతస్తులు రెండు ఇండ్ల మధ్య ఒక ఫీట్ వెడల్పు కూడా లేని ప్రదేశంలో ఓ వీధి కుక్క ప్రమాదవశాత్తు పడిపోయింది. సమాచారం అందుకున్న ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ ప్రతినిధులు రంగలోకి దిగి ఆ కుక్కను కాపాడారు. అమీర్‌పేట్ గురుద్వార్ సమీపంలోని మన్మీత్ చారిటబుల్ ట్రస్ట్ వ్వవస్థాపకులు సర్దార్ కుల్వంత్‌సింగ్ సింగ్ (టిల్లు భాయ్)కు బుధవారం ఇంట్లో కుక్క మూలుగు శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా రెండిండ్ల మధ్య ఇరుక్కుపోయిన కుక్క కనిపించింది. ట్రస్ట్ నిర్వాహకురాలు గుర్మీత్ (కోమల్) వెంటనే ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’కి సమాచారం అందించారు. సొసైటీ నిర్వాహకులు ప్రదీప్‌నాయర్ తన బృందం సభ్యులైన సంతోషి, సంజీవ్‌కుమార్, మనీశ్‌తో కలిసి అమీర్‌పేట్‌కు చేరుకుని దాదాపు 5 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగించి విజయవంతంగా పూర్తి చేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ శునకరాజును చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.