మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ 80వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్టోబర్ 11న ఆయన పుట్టిన రోజు. ఈ బర్త్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ‘ద ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ నాలుగు రోజుల పాటు అమితాబ్ నటించిన సినిమాలను ప్రద్శించనుంది. అక్టోబర్ 8 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 22 స్క్రీన్స్‌లో ఈ స్పెషల్ మూవీ ప్రదర్శనలు జరగనున్నాయి.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో బిగ్ బీ నటించిన 11 సూపర్ హిట్ మూవీస్ స్క్రీనింగ్ చేయనున్నారు. వీటిలో ‘డాన్’, ‘కాలా పత్తర్’, ‘కాలియా’, ‘కభీ కభీ’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘నమక్ హలాల్’, ‘అభిమాన్’, ‘దీవార్’, ‘మిలి’, ‘సత్తే పే సత్తా’, ‘చుప్కే’ వంటి చిత్రాలున్నాయి. ముంబై జుహూలోని పీవీఆర్ సినిమాస్‌లో అమితాబ్ పర్సనల్, మూవీ కెరీర్ ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దశాబ్దాలుగా నట ప్రస్థానం సాగిస్తున్న అమితాబ్…ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘గుడ్ బై’, ‘ఊంచాయి’, ‘ప్రాజెక్ట్ కె’ వంటి సినిమాలున్నాయి.