శాన్ ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 28: ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారీ స్థాయిలో లేఆఫ్‌లు ప్రకటించింది. దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించడానికి అమెజాన్ రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కంపెనీ నుంచి 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అమెజాన్‌లో పనిచేసే 15.5 లక్షల మంది మొత్తం ఉద్యోగులలో ఈ సంఖ్య చిన్నదే అయినప్పటికీ 3.50 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులలో 10 శాతం మందిపై వేటుపడనుండడం కార్పొరేట్ రంగంలో ఆందోళన కలిగిస్తోంది. 2022లో దాదాపు 27,000 మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన అమెజాన్ ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయడం ఇదే మొదటిసారి.
గడచిన రెండు సంవత్సరాలకు పైగా డివైసెస్, కమ్యూనికేషన్స్, పాడ్కాస్టింగ్తోసహా అనేక డివిజన్లలో కొద్దికొద్దిగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్న అమెజాన్ ఇప్పుడు ఒకేసారి 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఉద్వాసనకు గురవుతున్న ఉద్యోగులకు ఎలా వర్తమానం తెలియచేయాలో శిక్షణ పొందవలసిందిగా ఆయా టీమ్‌ల మేనేజర్లకు సోమవారం ఈమెయిల్ నోటిఫికేషన్ అందినట్లు ఈ విషయాలు తెలిసిన కొందరు వ్యక్తులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఈమెయిల్స్ ద్వారా ఉద్వాసన ప్రక్రియ మొదలవుతున్నట్లు వారు చెప్పారు.
హ్యూమన్ రిసోర్సస్(అంతర్గతంగా పిలుచుకునే పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ లేదా పీఎక్స్‌టీ), ఆపరేషన్స్, డివైసెస్, సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగాలలోని ఉద్యోగులపై వేటు పడనున్నట్లు వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఆర్ డివిజన్లో 10,000 పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 15 శాతం మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కోసం 10,000 కోట్ల డాలర్లను(రూ. 8.82 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ అదే సమయంలో భారీ స్థాయిలో ఖర్చులు తగ్గించుకునే చర్యలను కూడా చేపట్టారు.
అమెరికా, బ్రిటన్, కెనడాలోని ఉద్యోగులపై వేటు పడనున్నట్లు అంతర్గత సందేశాలను సమీక్షిస్తూ బిజినెస్ ఇన్సైడర్ పత్రిక పేర్కొంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతోపాటు 90 రోజుల ప్రయోజనాలు లభించనున్నట్లు కంపెనీ తన ఈమెయిల్లో వాగ్దానం చేసినట్లు పత్రిక తెలిపింది. కార్పొరేట్ స్థాయి ఉద్యోగులను తొలగించడంతోపాటు వచ్చే పండుగ సీజన్లో 2.50 లక్షల మంది తాత్కాలిక వేర్‌హౌస్ కార్మికులను నియమించాలని కూడా అమెజాన్ ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కార్పొరేట్ ఉద్యోగులను తొలగించి ఏఐ, ఆటోమేషన్‌పై అధిక పెట్టుబడులు పెట్టాలన్న అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ నిర్ణయం సోషల్ మీడియాలో దుమారం రేపింది. రెడిట్, ఎక్స్‌లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులను బలిచేసి స్వల్పకాలిక లాభాల కోసం అమెజాన్ యాజమాన్యం పరుగులు పెడుతోందని కంపెనీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్, టెక్నాలజీ, డివైసెస్, సర్వీసెస్, ఆపరేషన్స్, కమ్యూనికేషన్స్‌లో పనిచేసే టీమ్‌లు, అలెక్సా, పాడ్‌కాస్టింగ్ డివిజన్లలో పనిచేసే ఉద్యోగులపై భారీ స్థాయిలో వేటుపడనున్నట్లు వస్తున్న వార్తలపై సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెజాన్ నాయకత్వం, హాలిడే సీజన్ ముందు తీసుకున్న లేఆఫ్‌ల నిర్ణయంపై ఆన్లైన్ యూజర్లు విమర్శలు గుప్పించారు. కొందరు యూజర్లు నేరుగా అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీపైనే నిందలు వేశారు. ఈ వ్యక్తి సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది రెండు లేదా మూడు సార్లు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాడంటూ కొందరు విమర్శించారు. ఇటువంటి నిర్ణయాల వెనుక గల కార్పొరేట్ సంస్కృతిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించడం సీఈఓలకు మేలు చేసేది కాదని, అది నాయకత్వ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని వారు విమర్శించారు.