గాయాలు వేర్వేరైనా..
అందరి దుఃఖాలు ఒకేలాగ అనిపిస్తూ ఉంటాయి
దుఃఖిస్తూ దుఃఖిస్తూ చాలా దూరం ప్రయాణిస్తుంటాం
ఆ ప్రయాణంలో మనల్ని ఎవరైనా గుర్తుపట్టి
గుండెలకత్తుకొని ఓదారుస్తారని భ్రమపడి
కాసింత గట్టిగా గుక్కపెట్టి వినబడేలా ఏడుస్తుంటాం
దుక్కిస్తున్నప్పుడు గుణాన్ని కోల్పోవడం మనం
ఇంకా చిన్న పిల్లలమని గుర్తు చేస్తూ ఉంటుంది
చేతులు వదిలేసే దాకా తెలియదు పట్టుకున్న వారెవరో
గాయాలు చేసేదాకా తెలియదు కత్తులు ఎవరి చేతికిచ్చామో
అయినా సరే అదే తప్పు చేస్తుంటాం…
మళ్లీ మళ్లీ గాయపడటం అనేది గుండెకున్న జబ్బు
గాయాల తాలూకు పాఠాలే మిగిలి ఉన్నాయని తెలిశాక
మనుషులు చాలా తేలికైపోతారు
గాయపడ్డవాడా.. దిగులు పడకు!
కాలం చీకట్లనిచ్చింది కన్నీళ్లను నింపుకోవడానికే
తనివితీరా ఏడ్చి, గాయానికి ముద్దివ్వు మానిపోతుంది
హృదయానికి చేతినిచ్చి వెంట తీసుకుపో
గాయపరిచినవాళ్లే నిన్ను మార్చగలిగేవారని గుర్తుపెట్టుకో
ఇద్దరి హృదయాలు గాయపడ్డప్పుడు
దాహాలను తీర్చే నదులు కూడా కన్నీళ్లవుతాయి
కన్నీళ్లను నవ్వులుగా మార్చే సమయం కాలానికివ్వు
ఆ కన్నీళ్ళకు ఓ మనసు ఉంటుందని గుర్తించిన రోజు
మనుషులంతా ఒక్కటైపోతారు
పి.సుష్మ: 99597 05519