e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఉద్యోగులంతా టీఆర్‌ఎస్‌ వైపే

ఉద్యోగులంతా టీఆర్‌ఎస్‌ వైపే


సీపీఎస్‌ ఉద్యోగులదీ అదే మాట
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు వెల్లువ
సీఎం కేసీఆర్‌పై అచంచల విశ్వాసం
రాష్ట్రం వచ్చాకే ఉద్యోగులకు గౌరవం
ఏప్రిల్‌లో పీఆర్సీ ఖాయమన్న నేతలు

ఉద్యోగులంతా టీఆర్‌ఎస్‌ వైపే


హైదరాబాద్‌, మార్చి 8 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకే బేషరతుగా మద్దతు ఇస్తామని టీఎన్జీవోలు, టీజీవోలు, సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయసంఘాలు ముక్తకంఠంతో ప్రకటించాయి. వేర్వేరుగా సమావేశాలు పెట్టుకొని తమ మద్దతును తెలిపాయి. ఉద్యమకాలంనుంచీ ఉద్యమనేత వెన్నంటి నడిచిన ఉద్యోగులు. రాష్ట్రం వచ్చాక కడుపులో పెట్టుకొని కాపాడుకొంటున్న పాలకుడికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యోగులకు ఆనాడు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలబడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అంటున్నారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారం ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతివ్వాలనుకొంటున్నారో ఆయా సంఘాల నేతలు స్పష్టంగా వివరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టు ఉద్యోగులు చెప్తున్నారు. ముఖ్యంగా తాము ఆత్మగౌరవంతో జీవించేలా వేతనాలు పెరిగాయంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా మారడంతో అని జిల్లాల్లో ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని చెప్తున్నారు. మొన్న ఫిబ్రవరి నెలలోనే దాదాపు 15 వేల పదోన్నతులు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్తున్నారు.
అంగన్‌వాడీలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత సమాన పనికి సమాన వేతనమివ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవో 14ను అమలు చేసిన విషయాన్ని కూడా ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు. ఈ జీవోతోనే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, హోంగార్డులు వంటి చిరుద్యోగులకు భారీగా వేతనాలు పెరిగాయి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియనుకూడా మొదలుపెట్టిన తెలంగాణ సర్కారువెంటే తామూ ఉంటామని ఉద్యోగులు చెప్తున్నారు.
సీపీఎస్‌ ఉద్యోగులకు అండగా..
సీపీఎస్‌ ఉద్యోగులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలబడిందని సీపీఎస్‌ ఉద్యోగసంఘ నేతలు చెప్తున్నారు. సీపీఎస్‌ను రద్దుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోరిందని.. తమకు అండగా ఉంటానని హామీ ఇచ్చిందని పేర్కొంటున్నారు. పీఆర్సీలో పొందు పరిచిన సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి సీఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు ఆనందంగా చెప్తున్నారు.
భారీగా ఉద్యోగాల భర్తీ
నియామకాల విషయంలోనూ ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కాకుండా.. వివిధ శాఖల్లో 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టడం మునుపెన్నడూ ఏ సర్కారు హయాంలోనూ జరుగలేదని పేర్కొంటున్నారు. త్వరలోనే మరో 50 వేల నియామకాల నోటిఫికేషన్‌కు సిద్ధపడటం పట్ల సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇంతపెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్న సర్కారు వెంటే తాముంటామని ఉద్యోగసంఘనేతలు స్పష్టంచేస్తున్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలు చేపట్టిందని.. అన్ని వర్గాల ఉద్యోగులతో చర్చించాకే.. అందరి ఆమోదం తర్వాతే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలను ప్రతిపాదించారని చెప్తున్నారు. ఈ సవరణల వల్ల స్థానికేతరులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకుండా చేసిన విషయాన్ని గుర్తుచేసుకొంటున్నారు. తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు దక్కాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ చర్య తీసుకొన్నదని చెప్తున్నారు. అన్ని విధాలుగా ఉద్యోగుల వెన్నంటి ఉన్న తెలంగాణ సర్కారుకే తమ మద్దతు ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.
ప్రభుత్వానికి అండగా ఉంటాం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే ఎవ్వరూ ఊహించని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఆత్మగౌరవంతో బతికేవిధంగా వేతనాలు పెరిగాయి. ఏప్రిల్‌ నెలలో కూడా గౌరవంగా పీఆర్సీని ఇస్తారనే నమ్మకం మాకున్నది. కరోనా కారణంగా పీఆర్సీ ఇవ్వడంలో జాప్యం జరిగింది. సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల పక్షపాతి, ఆయన వెంటే మేముంటాం. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటాం.

 • మామిళ్ల రాజేందర్‌, అధ్యక్షుడు, టీఎన్జీవో
  సమస్యలను పరిష్కరిస్తున్న సర్కారు
  ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కారు ఇది. ఉద్యోగుల అన్ని సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు కాగానే 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పుడు కూడ మంచి ఫిట్‌మెంట్‌ ఇస్తుందన్న నమ్మకం ఉద్యోగులకు ఉన్నది. అడుగగానే యుద్ధ ప్రాతిపదికపైన పదోన్నతులు కల్పించారు. తాము పనిచేసే సర్కారుకు అండగా ఉంటాం.
 • రాయికంటి ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవో

మాకు నమ్మకమున్నది
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తారన్న నమ్మకం మాకు ఉన్నది. ఈ మేరకు స్పష్టమైన హామీ ఉన్నది. ఇప్పటి వరకు ఉద్యోగులకు అండగా ఉన్నది, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే భారీ పీఆర్సీ ఇచ్చింది. ఉద్యోగుల సమస్యలు తీరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం వెంటే ఉద్యోగులు, అధికారులు ఉంటారు.

 • సత్యనారాయణ,
  ప్రధాన కార్యదర్శి టీజీవో
  ఇద్దరినీ గెలిపించుకొంటాం
  సీపీఎస్‌ ఉద్యోగులకు ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్‌ సంపూర్ణంగా పరిష్కరిస్తారన్న నమ్మకం మాకున్నది.అందుకే ప్రభుత్వం బలపరిచిన ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించాం. సీపీఎస్‌ను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నది.
 • స్థితప్రజ్ఞ, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్‌ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

మద్దతు ఎందుకంటే
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం
ఆత్మగౌరవంతో జీవించేలా పెరిగిన వేతనాలు
జిల్లాల పునర్విభజనతో ఉద్యోగులకు పదోన్నతులు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సీపీఎస్‌ ఉద్యోగులకు అండగా ప్రభుత్వం
వివిధ శాఖల్లో 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యోగులంతా టీఆర్‌ఎస్‌ వైపే

ట్రెండింగ్‌

Advertisement