షార్జా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్.. ఆసియా కప్లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకుని సూపర్-4కు అర్హత సాధించింది. తొలి పోరులో శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గాన్.. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. మొసద్దక్ (48 నాటౌట్) టాప్ స్కోరర్. అఫ్గాన్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ముజీబ్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో అఫ్గాన్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 రన్స్ చేసింది. నజీబుల్లా జద్రాన్ (17 బంతుల్లో 43 నాటౌట్; ఒక ఫోర్, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. ఇబ్రహీం (42 నాటౌట్) రాణించాడు. అఫ్గాన్ విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు కావాల్సిన దశలో నజీబుల్లా విజృంభించాడు. ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రెండు సిక్సర్లు అరుసుకున్న అతడు.. సైఫుద్దీన్ వేసిన 18వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు సహా 22 పరుగులు రాబట్టాడు.