Luxury Suit | లాక్డౌన్ దెబ్బకు రెక్కలు తెగిన పక్షిలా విమానయానం విలవిల్లాడింది. కొవిడ్ అదుపులోకి రాగానే మళ్లీ రివ్వున ఎగిరింది! అంతేనా.. ప్రయాణికులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇస్తూ కొత్తపుంతలు తొక్కుతున్నది. విలాసాలు చూసొద్దామని విమానాలు ఎక్కే కాలం పోయి, విలాసాల కోసమే విమానాల్లో విహరించే రోజులు వచ్చేశాయి.
సూటూ బూటూ వేసుకుని విమానం ఎక్కగానే అన్ని మర్యాదలూ అందవు. సూటు బుక్ చేస్తేనే ఆ సౌఖ్యం, సుఖం! సాధారణంగా లగ్జరీ సూట్ ప్రయాణం సామాన్యులకు గగనమే. కానీ, కరోనా తెచ్చిన మార్పులు చుక్కల్లో ఉండే లగ్జరీని మబ్బుల్లోకి దించింది. ఫస్ట్‌క్లాస్ ప్రయాణంలోనూ లగ్జరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి విమానయాన సంస్థలు. మారిన పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా విమానాలూ మారక తప్పడం లేదు. కొవిడ్ తర్వాత ఫస్ట్‌క్లాస్ విస్తరిస్తున్నది. ఆ మేరకు ఎకానమీ క్లాస్ పలచబడిపోతున్నది.
కొవిడ్ భయంతో ఫస్ట్ క్లాస్‌ను కూడా సూట్‌లా మార్చేశారు. ప్రతి సీటుకు మధ్య అడ్డుగోడలు కట్టి ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేస్తున్నారు. పడుకునేందుకు, కూర్చునేందుకు, తినేందుకు, ఆఫీసు పనులు చేసుకునేందుకు, సుఖంగా సేదతీరేందుకు తగినన్ని వసతులు ఉంటున్నాయి. ఎయిర్‌లైన్స్‌ను బట్టి ఈ గదుల వైశాల్యంలో మార్పులుంటాయే కానీ, ఫీచర్స్ మాత్రం దాదాపుగా అవే. మెత్తని సోఫాలో కాళ్లు చాపుకుని కూర్చుని.. టీవీలో సినిమా చూడొచ్చు. కాసేపు హాయిగా నిద్రపోవచ్చు. ల్యాండ్ అయ్యే సమయానికి సాధారణ ప్రయాణికుల్లా సీట్ బెల్ట్ పెట్టుకుని బుద్ధిగా కూర్చోవచ్చు.
లగ్జరీ హోటల్లో సూట్ బుక్ చేసుకుని చక్కగా విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుందా అనుభవం. ఎయిర్ ఫ్రాన్స్ 2014లో ఈ ప్రీమియర్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్లను మొదలు పెట్టింది. ఫ్రెంచ్ ఆతిథ్యాన్ని గుర్తుకు తెచ్చేలా బోయింగ్ 777 విమానంలో లగ్జరీ విభాగాన్ని డిజైన్ చేశారు. ప్రత్యేకమైన గదిలా ఉండే ప్రీమియర్ ఫస్ట్‌క్లాస్ క్యాబిన్ 32 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో లెదర్ సోఫాలు, హెడ్రెస్ట్ కుర్చీలు, హెచ్డీ టచ్ స్క్రీన్ టీవీ ఉంటాయి. టీవీల్లో వివిధ భాషల సినిమాలు, గేమ్స్, వినోదం, పర్యాటకం.. ఇలా 1000 గంటల నిడివి ఉన్న కార్యక్రమాలు అప్లోడ్ చేసి ఉంటారు.
ఎయిర్ ఫ్రాన్స్‌కు దీటుగా ఎమిరేట్స్ కూడా అడుగుపెట్టింది. ఎంతైనా విలాసాల నగరం దుబాయ్ తీరానికి చేర్చే విమానాలు కదా. పొరుగుదేశాన్ని చూసి ఖతర్ ఎయిర్వేస్ కూడా నేనేం తక్కువా అన్నట్టు పోటీ పడింది. భోజనం విషయానికి వస్తే.. గ్రిల్డ్ ఫిష్ నుంచి ఫ్రూట్ సలాడ్ వరకు ఏది కావాలంటే అది… ఎయిర్ హోస్టెస్ తీసుకొస్తారు. నిద్రా సమయానికి దిండ్లు, దుప్పట్లు, లైటింగ్, మాయిశ్చరైజర్లు, లిప్ బామ్, పైజమా సెట్స్, సాక్స్, స్లిప్పర్స్ అందిస్తారు. సూట్ విమానంలో ప్రయాణానుభూతి కోసం కిటికీ తెరలుంటాయి. అంటే.. కిటికీల్లాంటి డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉంటారు. విమాన పరిసరాలను హెచ్డీ కెమెరాల్లో రికార్డు చేస్తూ వాటిని ఈ తెరల మీద ప్రదర్శిస్తారు. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలీ?
“విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?”