Apple Laysoff | టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ వంటి సంస్థలు పొదుపు చర్యలకు దిగాయి. పనితీరు సరిగ్గా లేకపోతే ఇంటికెళ్లి పోవాల్సి వస్తుందని సెర్చింజన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. ఉద్యోగులకు ఆల్టిమేటం ఇచ్చారు. ఆపిల్ సంస్థ మరో అడుగు ముందుకేసి 100 మంది కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూటర్లను తొలగించేసింది. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూటర్ల ఆధ్వర్యంలో సంస్థలో కొత్త ఉద్యోగుల నియామకాలు జరిగేవి.
ఉద్వాసనకు గురైన వారికి రెండు వారాల మెడికల్ బెనిఫిట్స్, వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇక రిక్రూటర్లలో పూర్తి కాల ఉద్యోగులుగా నియమితులైన వారు కొనసాగుతారని ఆపిల్ పేర్కొన్నట్లు బ్లూంబర్గ్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
సంస్థ ఆర్థిక అవసరాల రీత్యా ఉద్యోగులకు ఉద్వాసన తెలిపినట్లు ఆపిల్ ప్రకటించింది. ఖర్చులు ఆచితూచి పెడతామని గత నెలలోనే ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విభాగాల్లో మాత్రమే నియామకాలు చేపడతామని, పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఇంతకుముందు పనితీరు సరిగ్గా లేకపోతే ఉద్వాసన పలుకుతామంటూ గూగుల్ తన ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.