ఆదిబట్ల, నవంబర్ 13: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీ తో కలిసి ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదిబట్లకు చెందిన ఆనంద్ 400 గజాల స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతులకు టౌన్‌ప్లానింగ్ అధికారి వరప్రసాద్‌ను ఆశ్రయించాడు. ఆయన తన అసిస్టెంట్ వంశీని కలవాలని చెప్పడంతో వెంటనే ఆయనను కలిసి జీ ప్లస్ నాలుగు అంతస్తులకు పర్మిషన్ కావాలని ఇంటికి సంబంధించిన పత్రాలను అందజేశాడు.
రూ.లక్షా యాభై వేలు ఇవ్వాలని, అప్పుడే ఫైల్ ముందుకు పోతుందని చెప్పడంతో ఆనంద్ ముందుగా రూ.లక్ష ముట్టజెప్పాడు. కొద్దిరోజులకు టీపీవో అసిస్టెంట్ ఆనంద్‌కు ఫోన్ చేసి మరో రూ. 80 వేలు ఇస్తేనే అనుమతి ఇస్తామని చెప్పడంతో గురువారం ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంలో వంశీకి రూ.75 వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో అక్కడే కాపువేసి ఉన్న ఏసీబీ అధికారులు వంశీని పట్టుకున్నారు. వరప్రసాద్‌తోపాటు అసిస్టెంట్ వంశీని కోర్టులో హాజరు పరుస్తామని హైదరాబాద్ రేంజ్ 2 ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు.