Elnaaz Norouji | హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో వైపు హిజాబ్ ధరించని యువతులను అక్కడి పోలీసులు నిర్బంధిస్తున్నారు. మరో వైపు భారత్‌లో దీనికి వ్యతిరేకంగా పలువురు గళమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ హిట్ వెబ్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్ ఇల్నాజ్ నొరౌజీ సైతం స్పందించింది. ఇరాన్ మహిళలు, యువతలకు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది.
‘ప్రతి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చినా.. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా కోరుకున్నది ధరించే హక్కు ఆమెకు ఉండాలి. ఏ పురుషుడైనా, మరో స్త్రీ అయినా తీర్పు చెప్పే హక్కు లేదు. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయాధికారం. ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి! అన్న ఇల్నాజ్.. తాను నగ్నత్వాన్ని ‘ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్’ అని ప్రచారం చేయడం లేదు’ అని పేర్కొంది.
ఇల్నాజ్ నొరౌజీ ఇంతకు ముందు హిజాబ్‌ను వ్యతిరేకించి వార్తల్లో నిలిచింది. తన కుటుంబం మొత్తం ఇరాన్లో నివసిస్తుందని, నిరసనల కారణంగా తాను తన కుటుంబాన్ని సంప్రదించలేకపోయినట్లు పేర్కొంది. ఈ విషయంలో కలత చెందిన ఇల్నాజ్.. కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నది. ఈ సందర్భంగా ప్రజలు ఎంతదారుణంగా అణచివేతకు గురవుతున్నారో వీడియోలో తెలిపింది.