Vasthu Shastra | కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
– ఎస్. అనంత లక్ష్మి, బడంగ్పేట్
‘బిడ్డొచ్చిన వేళా.. గొడ్డొచ్చిన వేళా!’ అంటారు. ఆయా వ్యక్తుల అంతరంగాల అద్భుతాంశాలు కుటుంబ వ్యవహారాల మీద ప్రభావం చూపుతాయి. ఇందులో మంచి ఉండొచ్చు. చెడూ ఉండొచ్చు. అప్పటిదాకా అమ్మ కొంగుపట్టుకు తిరిగిన కొడుకు, భార్యను విడనాడక తల్లిదండ్రులను తక్కువగా చూసే పరిస్థితులు మనకు తెలియనివి కావు. వ్యక్తి ప్రభావం కూడా ప్రకృతి అంశమే. ఇది ఇంటికేకాదు రాష్ర్టాలకూ, దేశాలకూ వర్తిస్తుంది. పాలకులుగా వచ్చిన నాయకులను బట్టి, అధికారులను బట్టి.. రాష్ట్ర, దేశ పరిస్థితులు మారడం లేదా? అలాంటిది ఇంట్లో ఎందుకు ఆ మార్పులు ఉండవు? ఇంట్లోని నిర్మాణ అంశాలు కూడా ఆయా వ్యక్తుల రాకతో చేర్పులు – మార్పులు జరిగి, శుభాశుభ ఫలితాలు ఎదురవడం సహజం. తద్వారా గొప్ప ఇల్లు తిప్పలపాలు కావచ్చు. సాధారణ గృహాలు అసాధారణంగా మారవచ్చు.
ఇంట్లోని బెడ్రూముల మీద మెజనైన్ వేసి, దానిని లాంజ్‌గా వాడుకోవచ్చా?
– ఎస్, సుదేష్ణ, కొత్తూరు
ఇవ్వాళ ఇల్లు ఒక ఎంజాయ్మెంట్ ప్లేస్ అయ్యింది. ఎన్నెన్నో ఆలోచనలకు కార్యరూపంగా దానిని మలుస్తున్నారు. మీరు అనుకున్నట్టు పడక గదుల మీద వ్యవహార గదులు ఏర్పాటు చేసుకోవాలంటే.. ఆ ఇంటి స్లాబును ఎంత ఎత్తు చేస్తున్నాం అనేది ముందు నిర్ధారించాలి. కనీసం ఇరవై అడుగుల మేర హాలు స్లాబును స్థిరపరిచినప్పుడే మీరు అనుకున్న మెజనైన్ వేయగలుగుతారు. మీరు కేవలం మాస్టర్ బెడ్రూమ్ మీద కాకుండా అన్ని పడక గదులను ఒక అంతస్తు పెంచి వేసుకోవాలి. ఏదో ఒక గదిని చేయడం మంచిదికాదు. అలాగే ఆయా గదుల పై భాగానికి వెళ్లడానికి సొంత మెట్లు ఆయా గదుల్లో నిర్మించాలి. వాడకం లేని హాలు భాగాలలో రెండవ ఎత్తు ఓపెన్‌గా ఉంచుకోవాలి. ఒక గదిలో మెజనైన్ స్లాబ్ వేస్తే.. అది ఆ గదికే పరిమితంగా, ఆ గదివారే వాడుకునేలా గది కొలతలకు హద్దు చేసుకోవాలి. పైన ఒకరి గది నుంచి మరో గదికి వెళ్లే వెసులుబాటు ఉండకూడదు. ఇలాంటి హ్యాంగింగ్ స్లాబులు అవసరం అనుకుంటేనే వేయడం మంచిది. లేకుంటే.. ఒక ఫ్లోర్ ఖాళీగా ఉండిపోతుంది. అంతస్తు కాని అంతస్తుగా వాడుతూ, నిరంతరం వినియోగంలో ఉన్నప్పుడే వాటికి బలం. వాటితో ఫలం. లేదంటే కొన్నాళ్లకు అవి చెత్త (స్టోర్) స్లాబులుగా మిగిలిపోతాయి
మనిషి ఇష్ట ప్రకారమే ఇల్లు కట్టుకుంటాడు. ఇష్ట ప్రకారమే జీవిస్తాడు. ఇక అతణ్ని ఇల్లు ఎలా మారుస్తుంది?
– సత్య ప్రకాశ్, నిజామాబాద్
ఆ ఇష్టం అనేది అతనిలోకి ఎలా వచ్చింది? మనసే అంటామా.. మనసు నిర్మాణం ఏ విధంగా ఏర్పడింది? అది బుద్ధి ప్రేరితం అనుకుందామా.. అసలు బుద్ధికి వెనుక ఏముంది? దేని ప్రేరణ ఉంది? అనేది ప్రధాన అంశం అవుతుంది. భావన, మనసు, బుద్ధి అన్నీ అంతఃకరణ రూపాలే.. అయితే, అవి కేవలం మనం పుట్టినప్పటి వయసు మాత్రమే కలిగి ఉన్నాయి అనుకుంటే తప్పు. మనసుకు మన శరీర వయసుకన్నా వందల రెట్ల వయసు ఉంటుంది అనేది మూలమైన అంశం. ఇక్కడే అసలు కీలకమంతా.. శాస్త్ర అవగాహనంతా దాగి ఉంది. ఏ వ్యక్తి అయినా స్వభావాలతో పుడతాడు. అవి జన్మగతం. అందుకే ఆ స్వభావాలు చేసే ప్రేరణ ఎలాంటిది? అమోదయోగ్యమా.. కాదా? శాస్త్ర సమ్మతమా.. కాదా? అనేది అవసరం. తనకు ఇష్టమైన రంగు, వాసన, రూపం, వాతావరణంతో నచ్చిన ఇల్లు.. దిశల్లో ఉంటాడు. అది అతనికి పడుతుందా? ఆ ఇల్లు అతన్ని ఎలా స్పందింపజేస్తుంది? పాజిటివ్‌గానా? లేక నెగె
టివ్గానా? అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఎవరూ నచ్చనిది, మనసు ఒప్పనిది చేయరు. బుద్ధి స్థిరపరచకుండా.. హంతకుడు కూడా హత్య చేయడు. తన బుద్ధి చేష్టలు ఎంత గొప్పవి అనేది కదా ముందు తేలాల్సినవి. కాబట్టే.. ‘నీ బుద్ధి కోరినట్టు ఇలా కట్ట వద్దయ్యా.. ఈ దారి గోదారికి పోతుంది. నీ గమ్యానికి కాదు.. ఇది మార్చుకో! ఈ విధంగా నిర్మించు. ఈ పద్ధతిని ఆచరించు’ అని మహాత్ములు చెబితే.. పెద్దలు ఆ విధంగా తమ ఇండ్లను నిర్మించుకున్నారు. తమ జీవితాలను గొప్పవిగా చేసుకున్నారు.. అని శాస్త్రం చెబుతుంది. మనిషి బుద్ధి చక్కనిదైతే శాస్త్రమెందుకు? అస్త్రమెందుకు? మన నడకను, నడతను సవ్యం చేసేవి.. మన బుద్ధిని సరిదిద్దేవి పెద్దలు చెప్పిన శాస్ర్తాలు. అవి తప్పక ఆచరించాలి. అప్పుడే మన జీవితాలు భద్రం అవుతాయి.
ఇంట్లోనే మెట్లను.. ఒక వరుస ఆరు అడుగులు, మరో వరుస నాలుగు అడుగులు పెట్టుకొని కట్టుకోవచ్చా? ఇది వాస్తు సమ్మతమేనా?
– ఎస్. ఈశ్వర్, గుండాల
మేడ మీదికి వెళ్లడానికి మెట్లు అవసరం. ఇంటీరియర్ డిజైన్ కోసం మీరు రకరకాల కొలతలతో వేద్దామని అనుకుంటున్నారు. వేసుకోండి. ఫర్వాలేదు. మెట్ల విషయంలో ఆ మెట్ల నడక మొదట ఎటుగా సాగుతుందనేది ముఖ్యం. అది దక్షిణ ముఖంగా.. లేదా పడమర ముఖంగా మొదట సాగితే చాలు. ఇకపోతే ఆ మెట్ల స్థానం ఇంట్లోనా? బయటనా? చూసుకొని, ఈశాన్యం కాకుండా తూర్పు – ఉత్తరం కాకుండా మెట్లు వేసుకోగలిగితే చాలు. గేజింగ్ కొలతలు మీ ఇష్టం. ఆ మెట్లు వెడల్పు ఎంత ఉన్నా.. సవ్యమైన నడకలతో, అలవోకగా పైమేడకు చేర్చితే చాలు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?