సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. పొగాకు, నికోటిన్ ఏ రూపంలో ఉన్నా వాస్తవానికి మన ఆరోగ్యానికి హానికరమే. అయినా, నిత్యం ధూమపానం చేసేవారు సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించిన హెచ్చరిక సంకేతాలను పట్టించుకోరు. కొందరు సాధారణ సిగరెట్లకు బదులుగా హానికరం కాదని భావించి ఇ-సిగరెట్లు, వేప్లకు అలవాటుపడతారు. అయితే, ఇ-సిగరెట్లు లేదా వేప్‌లు సాధారణ సిగరెట్లలాగే హానికరమని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో నికోటిన్ కంటెంట్ సాధారణ సిగరెట్లలో కంటే దాదాపు సమానంగా లేదా కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా, ఇ-సిగరెట్లు, వేవ్‌లు ఇతర మార్గాల్లో కూడా హాని కలిగిస్తాయని మీకు తెలుసా? అయితే, ఈ వార్త చదవాల్సిందే.
స్కాట్లాండ్లోని ఒక బిజీ పబ్‌కు అయిర్షైర్కు చెందిన బ్లేయర్ టర్న్‌బుల్ (26) అనే బార్బర్ వేవ్‌ను జేబులో పెట్టుకుని వెళ్లాడు. అతడు పబ్‌లో ఎంజాయ్ చేస్తుండగా జేబులో ఉన్న వేవ్ ఒక్కసారిగా పేలింది.
దీంతో అతడి కాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ యువకుడిని క్రాస్హౌస్ దవాఖానకు తరలించారు. అతడి గాయాలకు చికిత్స చేసేందుకు వైద్యులు పక్క తొడ నుంచి చర్మాన్ని స్కిన్ గ్రాఫ్ట్గా ఉపయోగించాల్సి వచ్చింది. అతని మధ్య వేలు తప్ప మిగతా వేళ్లు, అరచేతిలో బొబ్బలు వచ్చాయి. బార్బర్‌ని క్రాస్హౌస్ హాస్పిటల్ నుంచి గ్లాస్గో రాయల్ ఇన్‌ఫర్మరీలోని స్పెషలిస్ట్ బర్న్ యూనిట్‌కి మార్చారు. వేప్ పేలడంతో కాలిన గాయాలు వారు చూసిన అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటని వైద్యులు పేర్కొన్నారు. బ్యాటరీ పేలడమే ప్రమాదానికి దారితీసిందని బ్లేయర్ తెలిపాడు. పేలిన వేవ్‌ను సెప్టెంబర్ 2020లో ఆన్లైన్ దిగ్గజం వీపీజడ్ నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నాడు.