హైదరాబాద్, మార్చి 9 : స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చిన సర్కారు తాజా నోటిఫికేషన్ల నుంచే ఈ ఫలాలను అందించనున్నది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్లల్లో ఆయా వివరాలను పేర్కొననున్నారు. 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనుండగా, మిగిలిన 5 శాతం పోస్టులు ఓపెన్ కోటాలో ఉంటాయి. ఇందులోనూ స్థానికులు పోటీపడి దక్కించుకోవచ్చు. అంటే 95 శాతానికి పైగా స్థానికులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొన్నిసార్లు 97, 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని పేర్కొన్నారు. జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారిగా లోకల్, ఓపెన్ కోటాను ఎలా వర్తింపజేస్తారన్నది పరిశీలిస్తే..
ఉదాహరణలిలా..
జిల్లా క్యాడర్: ఇందులో జగిత్యాల జిల్లాలోని 100 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైతే 95 శాతం ఉద్యోగాలు అంటే 95 ఉద్యోగాలకు ఆయా జిల్లాలోని అభ్యర్థులే అర్హులు. మిగిలిన 5 శాతం (అంటే 5 ఉద్యోగాలను) ఓపెన్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు రాష్ట్రంలోని ఏ జిల్లాలోని అభ్యర్థులైనా పోటీపడవచ్చు. మెరిట్ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ఈ కోటాలోనూ జగిత్యాల జిల్లా అభ్యర్థులు మెరిట్లో ఉంటే వారికి సైతం ఓపెన్ కోటాలోనే ఇస్తారు. అంటే ఈ లెక్కన స్థానిక కోటా 95 శాతాన్ని మించే అవకాశాలుంటాయి.