Gandhian Inspiration | ఆయన పేరు లాల్మోహన్ పాశ్వాన్.. బీహార్‌లోని నేపాల్ సరిహద్దుల్లో జీవిస్తున్నాడు. సుపాల్ జిల్లాలోని మారుమూల పల్లెటూళ్లో నివసిస్తున్న ఆయన వయస్సు 91 ఏండ్లు.. అయితేనేం.. ఆయన దేశభక్తి స్ఫూర్తి ముందు వయస్సు కూడా బలాదూరే మరి. తనను తాను గాంధేయవాదినన్న లాల్మోహన్ పాశ్వాన్ తనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌లు ఆదర్శం అన్నాడు. ప్రపంచ దేశాల కష్టాల కడలి నుంచి బయటపడేందుకు గాంధీజీ బోధించిన `అహింస` ఒక్కటే మార్గమని నమ్ముతున్నాడు. ఆయన దర్జీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 450 మువ్వన్నెల పతాకాలు కుట్టి పెట్టాలన్న ఆర్డర్ వచ్చింది.
మనం ఇప్పుడు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం కదా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట చేపట్టే ఈ వేడుకల నిర్వహణకు హెల్ప్‌ఏజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ పూనుకున్నది. అందుకు త్రివర్ణ పతాకాలు కూడా కావాలిగా.. కేవలం వారం రోజుల్లో 450 పతాకాలు కుట్టివ్వాలని లాల్మోహన్ పాశ్వాన్‌ను కోరారు హెల్ప్‌ఏజ్ ఇండియా నిర్వాహకులు.
అసలే గాంధేయవాది అయినా.. ఆ పని చేసేందుకు వయస్సు సహకరిస్తుందా.. అని సందేహించాడు. కానీ.. మూర్తిభవించిన దేశభక్తి స్ఫూర్తి ముందు వయస్సు బలాదూర్ అంది.. ప్రతి రోజూ 12 గంటల షెడ్యూల్‌తో మువ్వన్నెల పతాకాలు కుట్టడం పనిగా పెట్టుకున్నాడు. పంద్రాగస్టుకు ఒక రోజు ముందే ఆర్డర్ ఇచ్చిన వారికి పతాకాలు అందజేశానని చెప్పాడు.
`ఇలా తయారు చేసిన మువ్వన్నెల పతాకాలను స్థానిక స్కూళ్లు, ఆఫీసుల్లో పంపిణీ చేశాం. లాల్మోహన్ పాశ్వాన్ మాతో కలిసి ఎనిమిదేండ్లుగా పని చేస్తున్నారు. ఆయన మా అందరికీ స్ఫూర్తి` అని హెల్పేజ్ ఇండియా జిల్లా కోఆర్డినేటర్ జ్యోతిష్ ఝా తెలిపారు.