ఇంటి సింహద్వారాన్ని వెనుకకు తీసుకొని, దాని ముందు స్థలం వదిలికట్టడం వాస్తుకు మంచిదేనా?
ఎలమంచి శారద, కొత్తూరు
కొత్తదనం కోసం కొందరు ఆర్కిటెక్టులు తూర్పు గృహాలకు, ఉత్తరం గృహాలకు కూడా ఇలా ఇల్లు కట్ చేసి ప్రధాన ద్వారాన్ని వెనుకకు పెట్టి కడుతున్నారు. ఇది పెద్ద దోషం. చాలామందికి అది అర్థం కావడం లేదు. ‘ఫాయర్’ అని, ‘ఓపెన్’ అని తూర్పును, ఉత్తరాన్ని అలా తెంపు చేయొద్దు. తల భాగం లేనట్టు అవుతుంది. దక్షిణం, పడమర సింహ ద్వారపు గృహాలకు ఆ విధంగా కట్టుకోవచ్చు. ఇల్లును ముక్కలు చేసి మూలాలు కట్ చేసి కట్టడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది కొద్ది రోజులు బాగనిపించినా ఆ దోషాలు ఇంటి కాలం పెరుగుతున్న కొద్దీ ఇబ్బందులు పెడతాయి. ఇంటికి ఓ పద్ధతి ఉంటుంది కదా.. ఇల్లు ఏదైనా జీవితాలతో ముడిపడి ఉంటుందనే విషయం మరువద్దు.
మాది దక్షిణం ఇల్లు. ‘నల్లా గుంత’ తీస్తేనే మంచి నీళ్లుపట్టుకోవచ్చు. ఎక్కడ తీయాలి?
ముత్యాల ఆనంది, కందికల్
నల్లా నీళ్లు పట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో ఇంటి ముందు గుంత తీసి దానిలోకి నల్లా కనెక్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ దక్షిణం ఇంటికి దక్షిణం ఆగ్నేయంలో నుంచి మున్సిపల్ పైపును తూర్పు ఈశాన్యం వరకు తీసుకెళ్లి అక్కడ అవసరమైన లోతు తీసుకోండి. దానిలో నుంచి నీరు పట్టుకోండి. ఇంటి ముందు గుంతలు తీసుకోనప్పుడు ఇంటి ప్రధాన ద్వారం లోపల పడకుండా జాగ్రత్త పడండి. పూర్తి తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ, ‘నల్లా గుంత’ తీసుకోండి. ఇంటికి ఉత్తరంలోని ఖాళీస్థలం నల్లా గుంతకు అనువైంది.
గేటు మీద తోరణం లా కమాన్ కట్టుకోవచ్చా? చిన్న సెక్యురిటీ రూము ఇవ్వచ్చా?
మబ్బు వీరేశం
ఇంటి ప్రధాన గేటును, బాక్స్ ఆర్చిలా పెట్టుకొని దాని పక్కనే సెక్యూరిటీ రూము కట్టాలంటే మీరు ఉత్తరం గేటును పెట్టేటప్పుడు, ఆ గేటుకు పడమర భాగంలో ఉత్తరం ప్రహరీని అంటకుండా సెక్యూరిటీ రూము చిన్నగా కట్టుకోవచ్చు. తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టినప్పుడు ఆ గేటుకు దక్షిణ భాగాన సెక్యూరిటీ గది కట్టండి. గేటు మీద ఆర్చి (కమాన్) కట్టాలంటే అది ప్రహరీ గోడ కన్నా ఎత్తు వస్తుంది. అలాగే లోడుతో వచ్చే పెద్ద వాహనం ఇంటి గేటులోకి రావాలన్నా ఇబ్బంది ఉంటుంది. గృహాల గేట్లను ఓపెన్‌గా పెట్టుకోవడమే మంచిది. లే అవుట్ గేటు ఎత్తుగా కమాన్‌తో పెట్టుకోవచ్చు.
పడమర కాంపౌండు, దక్షిణం కాంపౌండు ఎంత ఎత్తయినా కట్టుకోవచ్చా? లేక ఏదైనా కొలత ఉంటుందా?
శ్రీనివాస్
ఇంటికి దక్షిణం, పడమర వైపు మీరు ఖాళీస్థలం తక్కువ వదిలి, ఎత్తయిన ప్రహరీలో కట్టినట్టయితే ఇంట్లోకి వెలుతురు చాలావరకు తగ్గిపోతుంది. ఖాళీ పది ఫీట్లు దక్షిణంలో ఉంటే ఆరు ఫీట్ల వరకూ గోడ కట్టుకోవచ్చు. ఇంట్లో కాంపౌండు లోపలి ఆవరణ వెలుగును గాలిని బట్టి ఇంటి లోపలి వాతావరణం ఉంటుంది. ప్రధానంగా ఇంటికి పెట్టే కిటికీలు మూత పడకుండా.. చుట్టూ ఉండే ప్రహరీలు ఉండాలి. అనగా ఇంటి చుట్టూ కనీసం ఆరు అడుగులు దక్షిణ పశ్చిమలలో పది అడుగులు తూర్పు ఉత్తరాల్లో ఇవ్వగలిగితే చక్కని వెలుతురు ఇంట్లో ఉంటుంది. తక్కువ ఖాళీ ఉన్నప్పుడు నాలుగు అడుగులు ఎత్తు సరి పోతుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678