మనుషులకు భాష ఎంత ముఖ్యమో కంప్యూటర్లకు కూడా భాష కూడా అంతే ముఖ్యం. మనుషుల్లో అనేక భాషలు ఉన్నట్టే కంప్యూటర్లో చాలా భాషలు ఉన్నాయి. వీటిలో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ముఖ్యమైనది. ఈ పైథాన్ లాంగ్వేజ్‌ని ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్లు విరివిగా వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ పైథాన్‌ను నేర్చుకుంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదని సాఫ్ట్వేర్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పైథాన్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం.
ప్రోగ్రామింగ్, పైథాన్ లాంగ్వేజ్ అనే పదాలు తరచూ వింటున్నాం. పైథాన్ అనేది ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో ఒకటి. 2020లో స్టాక్ ఓవర్ ఫ్లో రిపోర్ట్ ప్రకారం మోస్ట్ వాంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో పైథాన్ ఒకటో స్థానంలో ఉంది. అలాగే డెవలపర్స్ చాలా ఇష్టపడే లాంగ్వేజ్‌లలో మూడో స్థానంలో ఉంది.
ప్రోగ్రామింగ్ అంటే ఏంటి?
ప్రోగ్రామింగ్ అంటే ఒక కంప్యూటర్‌కి ఏం కావాలనుకుంటున్నారో వివరించడం. అలాగే సాఫ్ట్వేర్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కావాల్సిన దాన్ని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో కంప్యూటర్‌కి వివరించడం. వాటిని కోడ్ అని కూడా అంటారు. ప్రస్తుత కాలంలో రాయడం, చదవడం, నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అలాగే ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రోగ్రామింగ్ ఎంత ముఖ్యమైనదంటే ప్రభుత్వం NEP 2020 ప్రకారం ఆరో తరగతి నుంచి కోడింగ్‌ని తప్పనిసరి చేసింది.
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే?
ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ ఉపయోగిస్తాం కదా ఉదాహరణకు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ వంటివి. అదేవిధంగా ఒక మనిషి ఒక కంప్యూటర్‌తో మాట్లాడాలంటే కూడా ఒక లాంగ్వేజ్ అవసరం. దానినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ప్రపంచంలో సుమారు 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు ఉన్నాయి. అందులో సి, పైథాన్, జావా, గో, జావా స్రిప్ట్, కొట్లిన్ మొదలైనవి చాలా ప్రాచుర్యం పొందినవి. సాధారణంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మంచి నైపుణ్యం పెంపొందించుకుంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు కూడా వాటి రూల్స్ చూసి త్వరగా నేర్చుకోవచ్చు.
పైథాన్‌కు డిమాండ్
హ్యాకర్ న్యూస్ హైరింగ్ ట్రెండ్స్ ప్రకారం ప్రతి ఏటా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిమాండ్ సి, సి++, జావా వంటి ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పోలిస్తే పెరుగుతూ వస్తుంది. నైపుణ్యం ఉన్న పైథాన్ డెవలపర్లకు దేశంలో ఒరాకిల్, అమెజాన్ వంటి కంపెనీలు రూ.18 లక్షలు, రూ.22 లక్షల వేతనం ఇస్తున్నాయి. పైథాన్ లాంగ్వేజ్‌ను ఒక లెవల్ వరకు బాగా నేర్చుకుంటే మూల వేతనం రూ.6 లక్షలు వరకు ఉంటుంది. అలాగే పే సేల్ ప్రకారం అమెరికాలో కూడా పైథాన్ డెవలపర్లకు చాలా డిమాండ్ ఉంది. అకడ పైథాన్ డెవలపర్లకు వేతనం సుమారు రూ.66 లక్షల వరకు ఉంది.
వివిధ డొమైన్లలో
పైథాన్ లాంగ్వేజ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్ (AI/ML), ఐఓటీ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, టెస్టింగ్, గేమ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఇలా మరెన్నో డొమైన్లలో ఉపయోగిస్తుంటారు. చాలా మందికి AI/ML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు నేర్చుకోవాలనుకుంటారు. అవి నేర్చుకోవాలంటే ముందు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై పట్టు సాధించాలి.
రాహుల్ అత్తలూరి
సీఈఓ, నెక్ట్స్‌వేవ్