స్పిన్నర్ల విజృంభణకు ఓపెనర్ల బాదుడు తోడవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్లో పిచ్‌పై ఉత్కంఠ భరితంగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన మోర్గాన్ సేన శుక్రవారం జరుగనున్న టైటిల్ ఫైట్‌లో ధోనీ సేనతో తలపడేందుకు సిద్ధమైంది. గత సీజన్లో తుది మెట్టుపై బోల్తా పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టగా.. ఎలిమినేటర్‌లో బెంగళూరును చిత్తుచేసిన కోల్‌కతా.. అవే వ్యూహాలతో పంత్ సేనను పడగొట్టింది.
షార్జా: ఎలిమినేటర్ మ్యాచ్‌కు యాక్షన్ రీప్లేలా సాగిన పోరులో మరోసారి కోల్‌కతాదే పైచేయి అయింది. స్పిన్ త్రయం విజృంభించడంతో మొదట పంత్ సేనను తక్కువ పరుగులకే పరిమితం చేసిన కోల్‌కతా.. ఆ తర్వాత ఓపెనర్లు విజృంభించడంతో ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. శుక్రవారం జరుగనున్న తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా అమీతుమీ తేల్చుకోనుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (36; ఒక ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (30 నాటౌట్; ఒక ఫోర్, ఓ సిక్సర్) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (46) సాధికారికతతో ఆడటంతో కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడ, నోర్జే, అశ్విన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వెంకటేశ్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
ఆఖర్లో ఉత్కంఠ
136 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు వెంకటేశ్, గిల్ రాణించడంతో ఒక దశలో 123/1తో నిలిచిన కోల్‌కతా.. ఆ తర్వాత తడబడింది. 7 పరుగుల తేడాలో ఆరు వికెట్లు కోల్పోయి ఒక దశలో ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. మోర్గాన్ సేన విజయానికి 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో 18వ ఓవర్ వేసిన రబాడ ఒక పరుగు మాత్రమే ఇచ్చి దినేశ్ కార్తీక్ (0)ను ఔట్ చేస్తే.. మరుసటి ఓవర్లో నోర్జే మూడు పరుగులే ఇచ్చి మోర్గాన్ (0)ను బుట్టలో వేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో గెలుపునకు 7 పరుగులు అవసరం కాగా.. అశ్విన్ వరుస బంతుల్లో షకీబ్ (0), నరైన్ (0) ఔట్ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠ భరితంగా మార్చేశాడు. ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి (12 నాటౌట్)లాంగాన్ మీదుగా సిక్సర్ బాదడంతో కోల్‌కతా ఊపిరి పీల్చుకుంది.
స్కోరు బోర్డు
ఢిల్లీ: పృథ్వీషా (ఎల్బీ) వరుణ్ 18, ధవన్ (సి) షకీబ్ (బి) వరుణ్ 36, స్టోయినిస్ (బి) మావి 18, శ్రేయస్ (నాటౌట్) 30, పంత్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6, హెట్‌మైర్ (రనౌట్) 17, అక్షర్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 135/5. వికెట్ల పతనం: 1-32, 2-71, 3-83, 4-90, 5-117, బౌలింగ్: షకీబ్ 4-0-28-0, ఫెర్గూసన్ 4-0-26-1, నరైన్ 4-0-27-0, వరుణ్ 4-0-26-2, మావి 4-0-27-1.
కోల్‌కతా: గిల్ (సి) పంత్ (బి) అవేశ్ 46, వెంకటేశ్ (సి) (సబ్) స్మిత్ (బి) రబడ 55, రాణా (సి) హెట్‌మైర్ (బి) నోర్జే 13, త్రిపాఠి (నాటౌట్) 12, కార్తీక్ (బి) రబడ 0, మోర్గాన్ (బి) నోర్జే 0, షకీబ్ (ఎల్బీ) అశ్విన్ 0, నరైన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 0, ఫెర్గూసన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 19.5 ఓవర్లలో 136/7. వికెట్ల పతనం: 1-96, 2-123, 3-125, 4-126, 5-129, 6-130, 7-130, బౌలింగ్: నోర్జే 4-0-31-2, అశ్విన్ 3.5-0-27-2, అవేశ్ 4-0-22-1, అక్షర్ 4-0-32-0, రబడ 4-0-23-2.